Friday, November 22, 2024

ప్రామిసరీ నోటుపై ఎన్నికల వాగ్దానం

ఎన్నికలలో విజయం కోసం వాగ్దానాలు చేస్తారు, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తారు. ఇవన్నీ సర్వసాధారణం. కానీ ఏపీ పంచాయతీ ఎన్నికలలో నిలబడిన ఒక అభ్యర్థి ఒకింత కొత్తగా ఆలోచించారు. నోటి మాటగా చేసిన వాగ్దానాలను ప్రజలు నమ్మరనుకున్నాడో ఏమో…ఏకంగా తాను గెలిస్తే ఏం చేస్తాను అన్న అంశాలను ఏకంగా ప్రామిసరీ నోటుపైనే రాశాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరిగింది. పంచాయతీ ఎన్నికలలో నిలబడిన అభ్యర్థి తాను గెలిస్తే గ్రామానికి ఏమేం చేస్తాను అన్న విషయాన్ని ఏకంగా ప్రామిసరీ నోటే రాసేశాడు. గ్రామంలో అందరికీ ఉచితంగా కేబుల్ టీవీ కనెక్షన్, ఏడాది పాటు ఉచిత రేషన్, గ్రామంలో అందరికీ ఉచితంగా బీపీ, సుగర్ పరీక్షలు,  టెన్త్ విద్యార్థులకు పది వేల రూపాయల స్కాలర్ షిప్పు అంటూ తన వాగ్దానాలను పంచరత్నాలుగా అభివర్ణిస్తూ ప్రామిసరీ నోటు రాశాడు. అయితే ఎన్నికలలో ఆయనను ఆ ప్రామిసరీ నోటు కాపాడలేకపోయింది. పరాజయం పాలయ్యాడు. ఇంతకీ అతడు అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి. ప్రామిసరీ నోటు రాసినా ప్రజలు అతడిని నమ్మినట్లు లేదు. గ్రామస్తులందరికీ  లబ్ధి చేకూరేలా  వాగ్దానాల జల్లు కురిపించినా, మాట తప్పనంటూ నోటి మాటగా కాకుండా నోటురాసినా కూడా  ఓటర్లు కనికరించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement