Tuesday, November 26, 2024

ప్చ్‌.. నెదర్లాండ్స్‌!

  • 44 పరుగులకే ఆలౌట్‌… * 8 వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక
    షార్జా: టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో నెదర్లాండ్స్‌ జట్టు తమ పేరిట ఉన్న చెత్త రికార్డును మరోసారి పునరావృత్తం చేసింది. పొట్టి ప్రపంచకప్‌ 2021 క్వాలిఫయర్స్‌ గ్రూప్‌-ఎలో శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 44పరుగులకే ఆలౌటైంది. టోర్నీ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరుకాగా..రెండుసార్లు (39), (44) పరుగులతో నెదర్లాండ్స్‌ జట్టే తక్కువ స్కోరు నమోదు చేయడం అదీ శ్రీలంకపైనే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన శ్రీలంక బౌలింగ్‌ ఎంచుకుని నెదర్లాండ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పసికూనపై లంక బౌలర్లు విరుచుకుపడటంతో నెదర్లాండ్స్‌ కకావికలమైంది. హసరంగ 9పరుగులిచ్చి 3వికెట్లు, లహిరు కుమార 7పరుగులిచ్చి 3వికెట్లు తీయగా..తీక్షణ 3పరుగులిచ్చి 2వికెట్లు తీశాడు. చమీర 13పరుగులకు ఓ వికెట్‌ పడగొట్టడంతో నెదర్లాండ్స్‌ 10ఓవర్లలో 44పరుగులకే కుప్పకూలింది. కొలిన్‌ అకెర్‌మెన్‌ 11పరుగులతో రెండంకెల స్కోరుతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. మొత్తంమీద నెదర్లాండ్స్‌ 10ఓవర్లలో 44పరుగులు చేసి ఆలౌటైంది. 44పరుగుల స్కోరువద్ద చివరి 3వికెట్లు కూలడంతో నెదర్లాండ్స్‌ అతితక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం 45పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేక్రమంలో శ్రీలంక 2వికెట్లు కోల్పోయి 7.1ఓవర్లలో 45పరుగులు సాధించి గెలుపొందింది. ఓపెనర్‌ నిశాంక (0) డకౌట్‌గా వెనుదిరిగినా మరో ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా 24బంతుల్లో 6ఫోర్లు సాయంతో 33పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో శ్రీలంక నెదర్లాండ్స్‌పై 8వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. 3ఓవర్లలో 7పరుగులిచ్చి 3వికెట్లు తీసిన లహిరుకుమార ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. గ్రూప్‌-ఎలో ఆడిన 3 మ్యాచ్‌లను గెలిచి హ్యాట్రిక్‌ విజయాలను సాధించిన శ్రీలంక సూపర్‌12లోకి దర్జాగా అడుగుపెట్టింది. సూపర్‌12లో శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
    నెదర్లాండ్స్‌ పేరిట అత్యల్ప స్కోరు రికార్డు
    టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యల్ప స్కోరు నెదర్లాండ్స్‌ పేరిట ఉంది. 2014లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ 39పరుగులకే ఆలౌట్‌ అయింది. అజంతా మెండిస్‌, అంజెల్లో మాథ్యూస్‌ విజృంభించి చెరో మూడు వికెట్లు తీయగా లసిత్‌ మలింగ, కులశేఖర చెరో రెండు వికెట్లు తీశారు.
    ఈ మ్యాచ్‌లో శ్రీలంక 40పరుగుల విజయలక్ష్యాన్ని 5ఓవర్లలో వికెట్‌ నష్టానికి ఛేదించి విజయం సాధించింది. ఇదే టోర్నీలో శ్రీలంకకు వ్యతిరేకంగా న్యూజిలాండ్‌ 59పరుగులకే ఆలౌటైంది. లంక స్పిన్నర్లు రంగన హెరాత్‌ 3పరుగులిచ్చి 5వికెట్లు తీయడం విశేషం. అయితే రంగన హెరాత్‌కు తోడుగా సుచిత్ర సేననాయకే కూడా 3పరుగులిచ్చి 2వికెట్లు తీయడంతో శ్రీలంక 59పరుగులతేడాతో గెలిచింది. 2021 టీ20 ప్రపంచకప్‌లో మరోసారి లంకేయులు తమ రికార్డును పునరావృత్తం చేశారు. నెదర్లాండ్స్‌ను 44పరుగులకు ఆలౌట్‌ చేసి 45పరుగుల లక్ష్యాన్ని 7.1ఓవర్లలో 2వికెట్లు నష్టానికి 45పరుగులు చేసి 8వికెట్లు తేడాతో లంక జట్టు గెలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement