కొవిడ్ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతోపాటు సమస్త జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది ఇప్పటికీ కరోనా వేవ్ కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా మిగిల్చిన కష్టాల జాబితాలో ఇప్పుడు మరో అంశం వచ్చి చేరింది. కరోనా
బాలల ఆరోగ్య, మానసిక, సామాజిక వ్యవస్థలపైనా ప్రభావం చూపిందని యునిసెఫ్ తన తాజా నివేదికలో పేర్కొంది. దీని కారణంగా భారత్‌లో 5కోట్ల మందికిపైగా పిల్లలు మానసిక అనారోగ్యంతో బాధపడ్డారని నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురు పిల్లల్లో ఒకరు కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా మానసిక అనారోగ్యం బారినపడినట్లు తేల్చింది. ఆ సమయంలో 13 కోట్ల మందికిపైగా బాలలు ఇంటికే పరిమితమయ్యారని పేర్కొంది. దీంతో పిల్లలు అధిక ఒత్తిడికి లోనయ్యారని యూనిసెఫ్‌లో భారత ప్రతినిధి యాస్మిన్ అలీ హక్ తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంరక్షకులు.. పిల్లలకు మానసికంగా, సామాజికంగా సహకారం అందించాలి. బాలలు ఒత్తిడి, భయం, ఆవేదనను తట్టుకునేలా ముమ్మరంగా చర్యలు చేపట్టాలని చెప్పింది.
పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనైనప్పుడు ఎలా స్పందించాలన్న దానిపై.. చైల్డ్‌లైన్, ప్రభుత్వ అధికారులు, జిల్లాలో బాలల సంరక్షణ విభాగాలు, పిల్లల రక్షణ సంస్థల్లోని 8వేలకు పైగా సిబ్బందికి కరోనా సమయంలో శిక్షణ ఇచ్చినట్లు యూనిసెఫ్ తెలిపింది.