ఇండియన్ క్రికెట్‌లో స్టార్‌గా మారుతున్న కీపర్ రిషబ్ పంత్‌పై ఇంటా, బయట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ టెస్టు సిరీస్ గెలవడంతో కీలకపాత్ర వహించిన పంత్.. తాజాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ అద్భుతంగా రాణిస్తూ మరో వికెట్ కీపర్ సాహాకు పూర్తిగా ఎసరు పెట్టేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో 97, గబ్బా టెస్టులో 89 నాటౌట్, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తొలి టెస్టులో 91, రెండో టెస్టులో 58 నాటౌట్, నాలుగో టెస్టులో 101.. ఇవి గత ఆరు టెస్టుల్లో పంత్ స్కోర్లు. నాలుగు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో అద్భుత ఫామ్‌లో ఉన్న పంత్.. ది సేవియర్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక నాలుగో టెస్టులో భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన అతడు.. తొలుత నెమ్మదిగా ఆడి తర్వాత తనదైన శైలిలో దూకుడుగా ఆడి సెంచరీ సాధించాడు. 89 పరుగుల వద్ద అతడు అండర్సన్ బౌలింగ్‌లో ఆడిన స్కూప్ షాట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సెంచరీకి చేరువగా ఉన్న వేళ ఎవరైనా ఆ షాట్ ఆడతారా అని మాజీ ఆటగాళ్లు చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ షాట్ తాను ఆస్వాదించానని సెహ్వాగ్ ప్రశంసించగా.. 2021లోనే ఇది అత్యుత్తమ షాట్ అంటూ ఆకాష్ చోప్రా అభినందించాడు.