Monday, November 25, 2024

న్యూఢిల్లీ : హే రామ్! – దిగజారుతున్న రాజకీయ విలువలు

  • ఆంధ్రప్రభ దినపత్రిక పేజ్ వన్ స్పెషల్ స్టోరీ
  • ఆదర్శపురుషుల వ్యతిరేకులతో మిలాఖత్‌
  • రాజకీయ అవసరం కోసం ఎత్తులు జిత్తులు
  • జాతిపిత గాంధీజీ ప్రపంచ మార్గదర్శి
  • ప్రచారాస్త్రంగా మార్చేసుకున్న కాంగ్రెస్‌
  • గాడ్సే వారసులకు రాహుల్‌ స్వాగతం
  • శ్రీరాముడిని ప్రచారాస్త్రంగా చేసుకున్న బీజేపీ
  • రావణుడిని కీర్తిస్తున్న డీఎమ్‌కే…
  • ఆ పార్టీతో రాహుల్‌ చెట్టపట్టాల్‌
  • జైశ్రీరామ్‌ నినాదాన్ని సహించలేని మమత
  • స్ఫూర్తిప్రదాతల పట్ల రాజకీయ వ్యతిరేకత…
  • విస్తుపోతున్న ప్రపంచం

శ్రీరాముడు బీజేపీకి పరిమితంకాదు. ఆయన విశాల ప్రపంచానికి ఆదర్శ పురుషుడు. భారతావనికి పరమపూజ్యుడు. కేవలం రాజకీయ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని మహాత్ముడిని, శ్రీరాముడిని కొన్ని పార్టీలు వ్యతిరేకించడం. పైగా చారిత్రక నేపథ్యంలోని వీరి శతృవుల వారసుల్ని, కుటుంబ సభ్యుల్ని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలకు తావిస్తోంది.

దేశంలో రాజకీయ దిగజారుడుతనం పెరిగింది. స్వప్రయోజనాల కోసం ఉచ్చంనీచం వదిలేస్తున్నారు. దశాబ్దాల తరబడి అనుసరిస్తున్న సంప్రదాయాల్ని పక్కన పెట్టేస్తున్నారు. సిద్ధాంతాల్ని తుంగలో తొక్కేస్తున్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం సుదీర్ఘకాలం జరిగింది. కానీ చివరకు గాంధీ, నెహ్రూల హయాంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ వీరిద్దర్నీ తమ ప్రచారకర్తలుగా మార్చేసుకుంది. స్వతంత్ర భారతంలో గాంధీ పేరిట రాజకీయాలు నెరపింది. తొలి ఎన్నికల నుంచి ప్రస్తుత ఎన్నికల వరకు దేశంలో ప్రతిచోట ఆ పార్టీ గాంధీ పేరు చెప్పే ఓట్లను అభ్యర్థించడం ఓ సంప్రదాయంగా మలచుకొంది. కాంగ్రెస్‌ పార్టీకి మహాత్మాగాంధీని ఓట్లు రాబట్టే అస్త్రంగా రూపుదిద్దింది. అలాంటి కాంగ్రెస్‌ ఇప్పుడు అదే మహాత్ముడ్ని కాల్చిచంపిన గాడ్సే వంశీకుల్ని, అనుచరుల్ని తమ దరిచేర్చుకుంటోంది. శతృపక్షం బీజేపీపై ఆధిపత్యం సాధించే లక్ష్యంలో భాగంగా గాడ్సే కుటుంబ సభ్యులు, అనుచరులను కూడా ప్రశంసలతో ముంచెత్తుతోంది. వారికి కాంగ్రెస్‌ కండువాలేసి పార్టీలోకి ఆహ్వానిస్తోంది. వారి కోసం రెడ్‌కార్పెట్‌లు పరుస్తోంది. సాక్షాత్తు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ కూడా గాడ్సే వారసులు అనుచరుల కోసం పార్టీ సింహద్వారాల్ని తెరిచిపెడుతునారు. వారిని గొప్ప జాతీయ వాదులుగా, దేశభక్తులుగా శ్లాఘిస్తున్నారు. భోపాల్‌లో మాజీ కార్పొరేటర్‌, హిందూ మహాసభ సభ్యుడు బాబూలాల్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. బాబూలాల్‌ గాడ్సేకు దగ్గర బంధువు. చిన్నప్పటి నుంచి గాడ్సే ప్రబోధాలకు ఆకర్షితుడయ్యాడు. రెండేళ్ళ క్రితం భోపాల్‌లో జరిగిన గాడ్సే విగ్రహావిష్కరణలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించాడు. ఆ సందర్భంలో కూడా తాను గాడ్సే బోధనల ద్వారా ప్రేరణ పొందానంటూ బహిరంగంగా వెల్లడించారు. ప్రపంచం దృష్టిలో మహాత్ముడిని హత్య చేసిన గాడ్సే పట్ల ఇప్పటికీ ఓ దురభిప్రాయముంది. గాడ్సే హత్యకు పాల్పడ్డ కారణాలు ఏవైనప్పటికీ ప్రపంచానికి ఓ మహత్తర మార్గాన్ని చూపిన మహాత్ముడిని ఇలా నిర్ధాక్షిణ్యంగా చంపడాన్ని ఏ వ్యక్తి జీర్ణించుకోలేక పోయాడు. మహాత్ముడిని ప్రపంచం ఓ మార్గదర్శకుడిగా గుర్తించింది. ఆయన భారత్‌కు మాత్రమే జాతిపిత కాదు. సత్యం, అహింసలనే ఆయుధాలకున్న శక్తిని ఆయన ప్రపంచానికి చాటాడు. వాటితోనే రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడ లాడించాడు. ఆనాటికి దుర్బేధ్యమైన సైనికబలం కలిగిన బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని కూడా మెడలొంచి దేశం నుంచి వెళ్ళేట్టుగా చేయగలిగాడు. భారత స్వాతంత్య్రానంతరం కూడా మహాత్ముడు ప్రపంచంలో పలు ఉద్యమాలకు ప్రేరణగా నిల్చాడు. అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, దక్షిణాఫ్రికా వంటి పలు దేశాల్లో ప్రధాన రహదార్లకు మహాత్ముడి పేరెట్టారు. ఆయన శిలావిగ్రహాల్ని ప్రతిష్టించారు. ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. ఏ చిన్న అధికారిక పదవి లేకుండానే వందల కోట్ల మందికి మహాత్ముడు ప్రాత:కాల స్మరణీయుడయ్యాడు. ఆయన్ను కాంగ్రెస్‌ పార్టీ నాయకుడిగా ఏ జాతి చూడదు. భారతీయ ముద్దుబిడ్డగా, జాతిపితగానే ప్రపంచం ఆయన్ను పరిగణిస్తుంది. అలాంటి మహాత్ముడి ఏడు దశాబ్దాలకు పైగా భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల ప్రధాన ప్రచార కర్తగా వాడేసుకుంటోంది. తన ప్రచారంలో మహాత్ముడి బొమ్మల్ని వినియోగిస్తోంది. మహాత్ముడికి తానే అసలు సిసలైన వారసులుగా నమ్మబలుకుతోంది. తామే స్వాతంత్య్రాన్ని సాధించుకొచ్చినందున తమకే ఓట్లేసి అధికారాన్ని కట్టబెట్టాలని ఇంతకాలం ప్రజల్ని మభ్యపెట్టింది. అలాంటి కాంగ్రెస్‌ ఇప్పుడు అదే మహాత్ముడిని చంపిన గాడ్సే కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరుల్ని పార్టీలో చేర్చుకోవడం ఒక్క భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా విస్మయం కలిగిస్తోంది.
మనిషి సంఘ జీవిగా మారినప్పటి నుంచి ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆదిలో ప్రకృతిపై ఆధిపత్యం కోసం పోరాడాడు. జంతువులు, ఇతర జీవులపై ఆధిపత్యం సాధించాడు. అనంతరం తమలో తామే ఆధిపత్య పోరాటాలకు ఒడిగట్టారు. ఇందుకోసం రకరకాల సాకుల్ని వెదికాడు. కొన్ని ప్రాంతాల్లో నలుపు, తెలుపు మధ్య యుద్ధం. మరికొన్ని చోట్ల ఉత్తర, దక్షిణాల మధ్య పోరాటం. ఇంకొన్నిచోట్ల మత విశ్వాసాల మధ్య ఘర్షణలు.. ఇలా ఈ ఆధిపత్య పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. భారత్‌ విషయానికొస్తే మహ్మదీయులు, క్రిస్టియన్లు, ఇంకా ఈ దేశ పాలనలోకి , రాజకీయాల్లోకి చొరబడకముందు ఇది పూర్తిగా హిందువులకే పరిమితం. అలాగని అప్పుడు కూడా ఐక్యతలేదు. హిందువుల్లోనే శైవులు, వైష్ణవుల మధ్య ఆధిపత్య పోరాటం. వరుసగా మహ్మదీయులు, ఆ తర్వాత క్రైస్తవుల రాకతో హిందువులు, ముస్లిములు, క్రైస్తవుల మధ్య తిరిగి ఆధిపత్య ఘర్షణలు నెలకొన్నాయి. ఈలోగా ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి మధ్య పేచీలు. తూర్పు భారతానికి, పశ్చిమ భారతానికి మధ్య కొత్త తలనొప్పులు, రాష్ట్రాల మధ్య వివాదాలు, జిల్లాల మధ్య ప్రయోజనాల కోసం ప్రాకులాటలు, ఈ ఆధిపత్య పోరాటంలో అంచెలంచెలుగా సంస్కృతి, సంప్రదాయాలు మంటగలిసిపోతున్నాయి. విలువలకు నీళ్ళొదిలేశారు. కాంగ్రెస్‌ పార్టీ, దాని అధినేత రాహుల్‌గాంధీలు చిన్నపాటి రాజకీయ ప్రయోజనాల కోసం మహాత్ముడి హంతకుడైన గాడ్సే కుటుంబ సభ్యుల్ని పార్టీలో చేర్చుకుని ప్రశంసలతో ముంచెత్తడం ఇలాంటిదే. ఇప్పుడు ఇదొక్కటే కాదు.. తమిళనాట ఎన్నికల నగార మ్రోగింది. ఆ రాష్ట్రంలో డీఎంకేతో కలసి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ తహతహలాడుతోంది. సీట్ల సర్దుబాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో డీఎంకే రావణాసురుడ్ని పొగుడుతోంది. ఆయన్ను ఆరాధిస్తోంది. రావణుడు కూడా ద్రావిడ నేతేనంటూ ప్రచారం చేస్తోంది. ఓ వైపు దేశ వ్యాప్తంగా శ్రీరాముడిని ఆరాధ్యుడిగా కొలుస్తారు. ఆయన జీవనగమనాన్ని అనుసరిస్తారు. అయితే బీజేపీ శ్రీరాముడిని తమ ఖాతాలో వేసుకుంది. తమ పార్టీకి ప్రధాన ప్రచారకర్తగా మార్చేసుకుంది. ఇప్పుడు దేశంలో శ్రీరాముడంటే అది బీజేపీకి మాత్రమే హక్కుభుక్తాలున్న పదంగా మారిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీరాముడికి శత్రువైన రావణుడిని పూజించే పార్టీతో కాంగ్రెస్‌ చేతులు కలిపింది. అలాగే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా బహిరంగ వేదికపై ప్రధాన మోడి జై శ్రీరామ్‌ అంటూ నినాదం చేయగానే వేదిక దిగి వెళ్ళిపోయారు. రాన్రాను శ్రీరాముడిపై పూర్తిస్థాయి హక్కు బీజేపీకే పరిమితం చేసే పద్దతిలో కాంగ్రెస్‌, టీఎంసీ వంటి పార్టీలు ముందుకు సాగుతున్నాయి. శ్రీరాముడు బీజేపీకి పరిమితంకాదు. ఆయన విశాల ప్రపంచానికి ఆదర్శ పురుషుడు. భారతావనికి పరమపూజ్యుడు. కేవలం రాజకీయ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని మహాత్ముడిని, శ్రీరాముడిని కొన్నిపార్టీలు వ్యతిరేకించడం. పైగా చారిత్రక నేపథ్యంలోని వీరి శతృవుల వారసుల్ని, కుటుంబ సభ్యుల్ని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలకు తావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement