- ఆంధ్రప్రభ దినపత్రిక పేజ్ వన్ స్పెషల్ స్టోరీ
- పరస్పర వైరుద్ధ్య మార్కెట్లు
- ప్రఖ్యాత బ్రాండ్ చేతిగడియారాల కంపెనీలు మూత
- మొబైల్, స్మార్ట్ వాచ్‌ల దెబ్బ
- మరోవైపు గోల్డ్ షాపులు ధగధగ
- మాఫియా రంగ ప్రవేశం…
- గతంలో చిన్న దుకాణాలు
- నేడు ప్రచారార్భాటాలు
- నిపుణుల విశ్లేషణలు
ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్ల వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. ఆదిలో కేవలం సమాచార మార్పిడికే వినియోగించిన పోన్‌ను రాన్రాను రోజువారి కార్యకలాపాలాన్నింటికి ఆలంబనగా మారిపోయింది. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ పరోక్షంగా పలు పరిశ్రమల్ని దెబ్బతీశాయి. ఖరీదైన వాచీల పరిశ్రమ ఇందులో అత్యంత ముఖ్యమైంది. సమయాన్ని తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు వాచీలపైనే ఆధారపడతారు. వాచీల రూపకల్పన నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా వీటి వినియోగం పెరుగుతూనే ఉంది వాచీల్ని ధరించడం ఓ సంప్రదాయంగా మారింది. అత్యంత విలువైన వాచీని చేతికి పెట్టుకోవడం ఓ ఫ్యాషన్‌గా మారింది. దీంతో స్విట్జర్లాండ్‌లో ఉత్పత్తయ్యే ఖరీదైన వాచీలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. రాన్రాను అత్యాధునిక వాచీల ఉత్పత్తి ఎగుమతులకు స్విట్జర్లాండ్ వేదికైంది. ఆ దేశం నుంచి ఖరీదైన వాచీల ఎగుమతి ఏటా సగటున 5.4శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. దేశీయంగా ఖరీదైన వాచీల పరిశ్రమ 39బిలియన్ డాలర్లకు విస్తరించింది. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఖరీదైన వాచీలు కనుమరుగయ్యే దుస్థితేర్పడింది. రాడో, రోలెక్స్, బ్రెగ్యూట్, చోపార్డ్, జాకబ్ అండ్ కో, పాల్ న్యూ మేన్, పాటెక్, ఫిలిప్, హాబ్‌లాట్, బిగ్‌బ్యాంగ్ వంటి వాచీలు ధరలు మార్కెట్‌లో అనూహ్యంగా పడిపోయాయి. ఐదారేళ్ళ క్రితం రోలెక్స్ వాచీలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. అప్పట్లోనే భారతీయ కరెన్సీ విలువ మేరకు ఒక్కొక్క వాచీ రూ. 10నుంచి 22లక్షల వరకు ధర పలికేది. అలాంటి వాచీలు ఇప్పుడు ఆన్‌లైన్ వ్యాపారానికే పరిమితమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ర్యాడో, రోలెక్స్ వంటి అత్యంత విలువైన వాచీల విక్రయ షోరూమ్‌లు మూతబడ్డాయి. 2019నాటికే ఈ పరిస్థితి దారుణంగా ఉండగా కోవిడ్ రాకతో పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పుడీ వాచీలన్నీ ఆన్‌లైన్‌లో అసలు ధరపై 80నుంచి 85శాతం రిబేట్‌తో విక్రయాలకు పోటీలు పడుతున్నాయి. ఈ స్థాయిలో వాచీల ధరను ఉత్పాధక సంస్థలు తగ్గించాల్సి రావడం ఖచ్చితంగా సంస్థల ఆర్ధిక పరిస్థితిని దిగజారుస్తుంది. రాన్రాను ఈ విలువైన వాచీలన్నీ మార్కెట్ నుంచి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 40ఏళ్ళుగా విలువైన వాచీల పరిశ్రమలో స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని నమోదు చేసింది. 1983నుంచి 2014వరకు ఈ పరిశ్రమ వేగంగా విస్తరించింది. ఆ తర్వాత చైనా పోటీని తట్టుకోలేక పోవడం, అలాగే మొబైల్ ఫోన్ల వినియోగం పెరగడంతో చేతికి వాచీ పెట్టే ఫ్యాషన్ తగ్గిపోవడంతో ఈ పరిశ్రమ మనుగడ రోజు రోజుకు దిగజారింది. అలాగే ఆన్‌లైన్ విక్రయాలు విధానంలోకి ప్రవేశించడం కూడా ఖరీదైన వాచీల పరిశ్రమ జాప్యం చేసింది.
ఓ వైపు చేతికి తొడిగే వాచీలు విక్రయాలు పడిపోతుంటే మరోవైపు స్మార్ట్ వాచీల పై జనం మొగ్గు చూపుతున్నారు. ఈ వాచీల్ని సమయం తెలుసుకోవడంతో పాటు మొబైల్ ఫోన్‌లా కూడా వినియోగించొచ్చు. యాపిల్ ఇలాంటి వాచీల తయారీలో ముందడుగేసింది. సాధారణ మార్కెట్‌లో లభించే ఖరీదైన వాచీల్తో పోలిస్తే వీటి విలువ కూడా తక్కువ. పైగా వాచీలోనే ఫోన్ మాట్లాడొచ్చు. అలాగే ఒక మొబైల్ ఫోన్‌లో పొందే సౌకర్యాలు, సౌలభ్యాలు కూడా దీన్నుంచి పొందొచ్చు. దీంతో రాన్రాను చేతి కి ధరించే సాధారణ వాచీలు మటుమాయమయ్యే ప్రమాదం స్పష్టమౌతోంది. మహాత్మాగాంధీ వాచీని చేతికి తొడిగేవారుకాదు. మొలకు కట్టుకునేవారు. దాన్ని కూడా అప్పటి జనం గొప్పగా చెప్పుకునే వారు. ఆయన వినియోగించిన వాచీలకు విశేషమైన ప్రాధాన్యతుండేది. వాటిని బహిరంగ వేలంలో విక్రయిస్తే బాగా ధర పలికేవి. ఇప్పటికీ మహాత్ముడు వినియోగించిన వాచీలు భారత్, ఇంగ్లాండ్‌ల్లోని మ్యూజియంలు, ప్రభుత్వాల వద్ద భద్రంగా ఉన్నాయి. మహాత్ముడి స్మృతి చిహ్నాలుగా వీటిని ప్రభుత్వాలు భావితరాలకు అందించే ఏర్పాట్లు చేశాయి. ఇంతటి ఘన చరిత్రున్న వాచీలు మొబైల్ ఫోన్‌ల జోరులో మనుగడ సాగించలేక చతికిలబడుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇందుకు విరుద్దమైన పరిస్థితి బంగారు ఆభరణాల వ్యాపారంలో నెలకొంది. ముఖ్యంగా భారతీయ జ్యూయలరీ మార్కెట్ ఏటా 3.8శాతం చొప్పున పెరుగుతోంది. ఈ రంగంలోకి కార్పొరేట్లు ప్రవేశించాయి. విదేశీ వ్యాపారులు వీటిలో భారీగా పెట్టుబడులు పెట్టారు. పరోక్షంగా మాఫియా కూడా ఇందులో వేళ్ళూనుకుంది. ఇతర వ్యాపారాలన్నింటికంటే బంగారు నగల వర్తక వ్యాపారులు, షోరూమ్‌ల నిర్వాహకులు భారీగా ప్రచారార్భాటం నిర్వహిస్తున్నారు. మీడియాతో ప్రతి నిత్యం ప్రకటనలిస్తున్నారు. పేపర్లు, టివి ప్రకటనల్లో వీరిదే సింహభాగం ఎంతో కష్టపడి సంపాదించిన మీ ప్రతిపైసాకు మేం మాత్రమే న్యాయం చేస్తాం.. మా దగ్గరే నగలు కొనండి.. ఇతర దుకాణాలన్నింటికంటే మా దగ్గరే ధర తక్కువ.. మెరుగైన నాణ్యతనిస్తాం.. అంటూ చీటికి మాటికి టివిల్లో వీరు మెరుస్తారు. కేవలం కొనమని చెప్పడమే కాదు.. మీ దగ్గరున్న బంగారాన్ని అవసరం కోసం మాకు మాత్రమే అమ్మండి.. దానికి న్యాయబద్దమైన ధర చెల్లిస్తామంటూ ఊదరగొడతారు. వార్తలు చూస్తున్నా.. టివిల్లో సినిమాలు చూస్తున్నా.. ఆఖరకు గణతంత్ర దినోత్సవ వేడుకల్ని తిలకిస్తున్న మధ్యలో వీరు ప్రత్యక్ష మౌతారు. తమ దుకాణాల విశిష్టతను వల్లివేస్తారు. ఓ వైపు మార్కెట్‌లో చారిత్రక నేపధ్యం కలిగిన అతిపెద్ద ఉత్పాధక సంస్థలు కనుమరుగయ్యే పరిస్థితుంటే మరోవైపు అందుకు విరుద్దంగా ఒకప్పుడు చిన్న చిన్న దుకాణాలకే పరిమితమైన బంగారు నగల వ్యాపారం ఇప్పుడు నగరాల్లో అతిపెద్ద ఆర్భాటం, అట్టహాసాల్తో కూడిన షోరూమ్‌ల స్థాయికెదగడం, రోజు రోజుకు ప్రచారంతో వ్యాపారాన్ని విస్తరించుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లోని పరస్పర వైరుద్యానికి అద్దంపడుతోంందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.