Friday, November 22, 2024

న్యూఢిల్లీ : అగ్రి సెస్ రాష్ట్రాలకే : నిర్మలా సీతారామన్

అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌(అగ్రి సెస్‌)పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టతనిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.30 వేల కోట్ల అగ్రిసెస్‌ రాష్ట్రాలకు అందించను న్నామని తెలిపారు. అగ్రిసెస్‌ వసూళ్లతో ఏపీఎంసీ (అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీల మౌలిక వసతులను మెరుగుపరచ నున్నామని ఆమె స్పష్టం చేశారు. నూతన వ్యవసాయచట్టాలను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా రైతులు, ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో సీతారామన్‌ మాట్లాడుతూ… ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు ఒక్క ఏపీఎంసీ మార్కెట్‌ మూతపడలేదని గుర్తుచేశారు. రైతులకు ఎంతో కీలకమైన ఏపీఎంసీల బలోపేతంపై దృష్టిపెట్టామని ఆమె వివరించారు. బడ్జెట్‌ 2021-22పై లోక్‌సభలో జనరల్‌ డిబేట్‌ సందర్భంగా ఆర్థిక మంత్రి సీతారామన్‌ ఈ విధంగా సమాధానమిచ్చారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ తమదని యూపీఏ ప్రభుత్వం చెబుతోంది. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పించే విషయంలో ఈ పథకాన్ని సరైన రీతిలో నిర్వహించలేదని కాంగ్రెస్‌ను విమర్శించారు. కీలకమైన పథకాలకు ప్రాణం పోశారు. కానీ స్నేహితుల కోసం వాటిని దుర్వినియోగపరిచారని ఆమె అన్నారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కానీ కేటాయించిన మొత్తాన్ని వినియోగించలేదు. స్నేహితులకు ఇచ్చి.. వాస్తవ కార్మికులను మరిచిపోయారని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏకి రూ.1.1 లక్షల కోట్లు కేటాయించాం. అయితే ఏప్రిల్‌ నాటికి రూ.90 వేల కోట్లు ఉపయోగించే అవకాశం ఉంది. అయినప్పటికీ కేటాయింపులు, వినియోగం విషయంలో ఇదే అత్యధికమని ఆమె అన్నారు. ప్రభుత్వ స్నేహితులు దేశ సామాన్య ప్రజలేనని ఆమె అన్నారు. సామాన్యుల కోసమే టాయిలెట్లు, ఇళ్లు, విద్యుత్‌తోపాటు ఇతర సౌకర్యాల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చామని ఆమె పేర్కొన్నారు. వీధి వ్యాపారులకు చేయూతనిచ్చే ఉద్దేశ్యంతో పీఎం స్వానిధి పథకాన్ని ప్రవేశపెట్టాం. వీధి వ్యాపారులకు రూ.10 వేల మూలధనాన్ని ఇవ్వనున్నామని ఆమె వివరించారు. వీధి వ్యాపారులందరూ ఎవరికీ స్నేహితులు కాదని, అందరివారన్నారు. ప్రభుత్వం అన్నీ సూచనలను పరిశీలించింది. దేశ పారిశ్రామిక రంగం నుంచి సూచనల ప్రకారం విధానాలను రూపొందించామని ఆమె చెప్పారు. ప్రభుత్వం ఎంచుకున్న విధానం పూర్తిగా విభిన్నమైనదని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement