Friday, November 22, 2024

తెలంగాణలో మరో కొత్త వ్యాధి

తెలంగాణలో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఏకంగా 4వేల కోళ్లు మృతి చెందాయి. దీంతో స్థానికులు బర్డ్ ఫ్లూ అనుకుని ఆందోళన పడ్డారు. అయితే పశువుల వైద్యులు పరీక్షలు చేసి బర్డ్ ఫ్లూ కాదని నిర్ధారించారు. రాణికెట్ అనే వ్యాధితో కోళ్లు మృతి చెందాయని స్పష్టం చేశారు.

ప్రతిరోజూ మాదిరే మంగళవారం ఉదయం ఓ స్థానిక రైతు కోళ్లకు నీళ్లు పెడదామని కోళ్లఫారం వద్దకు వెళ్లాడు. రోజూ అరిచే కోళ్లు అరవకపోవడంతో అతడికి అనుమానం వచ్చి కోళ్లను పరిశీలించాడు. అవి చనిపోయి ఉండటంతో వెంటనే షాక్‌కు గురయ్యాడు. సుమారు 4వేల కోళ్లు మృతి చెందడంతో ఊసురుమన్నాడు. దీంతో చేసేదేమీ లేక గోయి తీసి కోళ్లను పాతిపెట్టాడు. కాగా తాను రూ.20 లక్షలు నష్టపోయినట్లు రైతు ఆవేదన చెందాడు.

రాణికెట్ వ్యాధి సోకిన కోళ్లకు రెక్కలు నేలవాలతాయని, వాటి మెడ చచ్చుపడి పక్షవాతం వస్తుందని వైద్యులు తెలిపారు. అనంతరం ఉన్నట్టుండి కోళ్లు మరణిస్తాయన్నారు. రాణికెట్ వ్యాధికి కోళ్లు గురికాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వేయాలని వారు సూచించారు. ఈ వ్యాధి ముఖ్యంగా కోళ్లకు, అడవుల్లో పక్షులకు సోకుతుందన్నారు. రాణికెట్ వ్యాధి వచ్చిన కోళ్లు గుడ్లు పెట్టడం మానేస్తాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాధి సులభంగా ఇతర కోళ్లకు పాకే అవకాశం ఉందని, కాబట్టి కోళ్ల యజమానులు జాగ్రత్తలు వహించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement