Friday, November 22, 2024

తిమింగలం వాంతి విలువ రూ.1.9 కోట్లు

థాయ్‌లాండ్‌లో ఓ 49 ఏళ్ల మహిళకు బీచ్‌లో వెళ్తుండగా 1.9 లక్షల పౌండ్లు (భారత కరెన్సీలో రూ.1.9 కోట్లు) విలువ గల తిమింగలం వాంతి చేసుకున్న పదార్థం కనిపించింది. ఫిబ్రవరి 23న సిరిపొర్న్‌ నియామ్‌రిన్‌ అనే మహిళ నఖోన్‌ సి తమ్మరత్‌ ప్రావిన్స్‌లో ఉన్న తన బీచ్‌ హౌస్‌ వద్ద వాకింగ్ చేస్తుండగా భారీ వ్యర్థ పదార్థం ఒడ్డుకు కొట్టుకువచ్చి కనిపించింది. అయితే దాన్ని పరిశీలించిన ఆమె.. ఆ పదార్థం చేపల వాసన రావడంతో అది చేపల వ్యర్థాలేమోనని అనుకుంది. అది ఎంతో కొంత విలువ చేస్తుందేమోనని భావించిన ఆమె దాన్ని తన ఇంటికి తెచ్చింది. ఈ క్రమంలోనే ఆమె తన ఇరుగు పొరుగు వారితో మాట్లాడగా అది చేపల వ్యర్థం కాదని, తిమింగలం వాంతి అని తేలింది. దాన్ని ‘ఎంబర్‌గ్రీస్’ అని పిలుస్తారని, ఆ పదార్థాన్ని పెర్‌ఫ్యూమ్‌ల తయారీలో వాడుతారని, దాని విలువ పెద్ద మొత్తంలో ఉంటుందని వెల్లడైంది. ఆ వాంతి పదార్థం బరువు సుమారుగా 7 కిలోల వరకు ఉందని మహిళ వెల్లడించింది. దాని విలువ దాదాపుగా 1.9 లక్షల పౌండ్లుగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఈ పదార్థాన్ని విక్రయించడం కోసం ఆమె నిపుణులను సంప్రదించింది. ఈ పదార్థాన్ని విక్రయించడం ద్వారా వచ్చే మొత్తాన్ని తన కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఉపయోగిస్తానని మహిళ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement