అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం మాట వినాలా?? లేక ఎమ్మెల్యే చెప్పిన మాట వినాలా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. తాడిపత్రి పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే దుకాణాలు తెరవాలని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దుకానదారులతో సమావేశం ఏర్పాటు చేసి తీర్మానించారు. కాసేపటికే రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లుగా ప్రకటన జారీ చేసింది. ఇప్పుడు తాడిపత్రిలో ఏ కర్ఫ్యూ పాటించాలంటూ ప్రజలు అయోమయంలో ఉన్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాజ్యాంగం అనేది రాష్ట్రం అంతా ఒక విధంగా తాడిపత్రిలో మరో విధంగా ఉంటుందా అని ఎద్దేవా చేశారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బంద్ చేయడం సరైన నిర్ణయమే.. కానీ కేవలం దుకాణాలనే కాకుండా వాటితో పాటు మద్యం దుకాణాలు, బస్సులను కూడా బంద్ చేయాలన్నారు. అలాగే తాడిపత్రిలో టీడీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.