ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా సవరణపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిపై విచారణ తర్వాత ఎన్నికలకు అనుమతి వచ్చింది. అయితే ఎన్నికల జాబితాలో అక్రమాల వ్యవహారం స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు శనివారపుపేటలోని పోలింగ్ బూత్‌కు వెళ్లిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు గల్లంతైంది. పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసేందుకు సిద్ధమైన తరుణంలో ఆయన ఓటు లేదని ఎన్నికల అధికారులు గుర్తించారు. దీంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం అయిన తన ఓటే గల్లంతు కావడం ఏంటని వారిని నిలదీశారు. చివరకు చేసేది లేక నిరాశగా వెనుదిరిగారు.
అటు ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, ఎంపీ గల్లా జయదేవ్, తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. విశాఖ కార్పొరేషన్ పరిధిలోని మారుతీనగర్ పోలింగ్ కేంద్రంలో ఎంపీ విజయసాయిరెడ్డి సతీసమేతంగా ఓటు వేశారు.