మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో నిరసనల సెగలు ఎగిసిపడుతున్నాయి. బుధవారం సాయంత్రం దర్శన్‌సింగ్ అనే టీఆర్ ఎస్ నాయకుడు ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్న తనకు పార్టీ టికెట్ కేటాయించడం లేదని ఆవేదన చెందుతూ హన్మకొండలోని బీఎస్ ఎన్ ఎల్ టవర్ ఎక్కి నాలుగు గంటల పాటు హై టెన్షన్ సృష్టించాడు. పోలీసులు, టీఆర్ఎస్ నేతల నిర్విరామంగా శ్రమించి టికెట్ వచ్చేలా చేస్తామని పార్టీ పెద్దల నుంచి హామీ వచ్చాకా నాలుగు గంటల తర్వాత రాత్రి 8గంటల సమయంలో కిందకి దిగాడు.
తాజాగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తుమ్మల శోభారాణి అనే మహిళా నాయకురాలు 58వ డివిజన్ జనరల్ మహిళకు రిజర్వేషన్ కావడంతో తనకే టికెట్ కేటాయించాలని అదాలత్ సెంటర్‌లోని ఓ ప్రైవేట్ కాంప్లెక్స్ ఎక్కి పెట్రోల్ బాటిల్‌తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. శోభారాణి గతంలో టీఆర్ఎస్ పార్టీ అర్బన్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వడానికి కొంతమంది రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపిస్తోంది. ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్న న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాగా బీఫారాలు అందజేసేందుకు నేడే చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసిన అభ్యర్థులు పార్టీ బీఫారం కోసం పట్టుబడుతున్నారు.