మానవాళి కొత్త సవాళ్లను ఎదుర్కొనబోతోంది. ఇప్పటికే కరోనా వైరస్‌తో బెంబేలెత్తిపోయిన ప్రపంచం దానికంటే ఘోరమైన ఉపద్రవాన్ని చవిచూడనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అయితే అది మరో వైరస్ కాదు… మానవ జీవనశైలి నుంచే ఈసారి ఇది ఎదురవుతోంది. అదే వినికిడి సమస్య! వినడానికి ఇది చిన్న అంశంగా కనిపిస్తున్నాపెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుందని మంగళవారం తాజాగా విడుదల చేసిన తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వినికిడి సమస్యపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించడం ఇదే తొలిసారి. 2019 గణాంకాల ప్రకారం 160 కోట్ల మంది వినికిడి సమస్యతో బాధపడుతుండగా, మరో 30 ఏళ్లలో ఈ సంఖ్య 250 కోట్లకు చేరుకోనుందని వెల్లడించింది. వినికిడి సమస్య వల్ల ప్రతి ఏటా 73 లక్షల కోట్ల నష్టం జరగుతుందని హెచ్చరించింది. ప్రపంచ దేశాలు వెనువెంటనే స్పందించి ఈ సమస్యను ఎదుర్కొనడానికి వైద్యారోగ్య ప్యాకేజీలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇప్పటికే పలు దేశాల్లో వినికిడి సమస్యను ఎదుర్కొంటున్న వారికి వైద్యసాయం అందడం లేదని పేర్కొంది. వైద్య సదుపాయాలు ఉన్న దేశాల్లో కూడా తీవ్ర నిర్లక్ష్యం వల్ల ఈ ముప్పు పెరుగుతోందని తెలిపింది. చిన్న పిల్లల్లో 60 శాతం మందికి వెంటనే స్పందిస్తే నివారణ లభిస్తుందని తెలిపింది. ఇది కేవలం వైద్య ఖర్చుల వల్ల ఏర్పడే నష్టం మాత్రమే కాదని, కమ్యూనికేషన్లు, విద్య, ఉద్యోగాల్లో ఏర్పడే నష్ఠంగా వివరించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement