చెన్నై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు ఇద్దరు కిలాడి లేడీలను అదుపులోకి తీసుకున్నారు. ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో మాదక ద్రవ్యాలను దాచి.. గుట్టు చప్పుడు కాకుండా తరలించే యత్నం చేయగా కస్టమ్స్ అధికారులు పసిగట్టారు. తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. 70 కోట్లు విలువ చేసే 10 కేజీల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్ బర్గ్ నుంచి ఇద్దరు మహిళలు చెన్నై వచ్చారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా మాదకద్రవ్యాలను ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచారు. అంతేగాక ఘాటైన స్ప్రే కొట్టారు. సౌత్ ఆఫ్రికా నుంచి మోసుకొని వచ్చిన మాదకద్రవ్యాలను తరలించడానికి ఈ విధంగా ప్లాన్ చేశారు. అధికారుల దృష్టి మరల్చేందుకు చాలా తెలివిగా.. ఆరోగ్యంగా ఉన్నప్పటికి వీల్ చెయిర్‌లో కూర్చొని బయటకు చెక్కేసే ప్రయత్నం చేశారు. కిలాడి లేడీల వ్యవహారంపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అడ్డగించారు. వీల్ చెయిర్‌పై ఎందుకు వెళుతున్నారంటూ ప్రశ్నించగా.. నీరసంగా ఉందని అందుకే వీల్ చెయిర్ తీసుకున్నామంటూ మరో లేడి ప్రయాణికురాలు జవాబిచ్చింది. ఇద్దరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకోగా.. గుట్టు విప్పారు. ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో ఉన్న మాదకద్రవ్యాల విషయం చెప్పారు. లేడి కిలాడీలపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు ఎవరి కోసం తెచ్చారనే సమాచారాన్ని కూపీ లాగుతున్నారు. దీని వెనుక ఉన్న సూత్రధారిపై లోతుగా విచారణ జరుపుతున్నారు.