టీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో గత ఏడాది తరహాలో ఉగాది పండుగను ఈ ఏడాది కూడా నిరాడంబరంగా జరుపుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడం దుమారం లేపుతోంది. ఎందుకంటే ఉగాది పండుగపై ఆంక్షలు విధించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. మరి నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా లక్షమందితో బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టడంతో టీఆర్ఎస్ పార్టీని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఉగాది పండుగ సందర్భంగా ఈనెల 12న తెలంగాణ ఎక్కడా సామూహిక పంచాంగ శ్రవణం నిర్వహించవద్దని ప్రభుత్వం చెప్పింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈనెల 14న హాలియాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ తలపెట్టింది. ఇక్కడే టీఆర్ఎస్ పార్టీ విమర్శల పాలైంది. కేసీఆర్ బహిరంగ సభకు అడ్డురాని కరోనా హిందువుల పండుగ ఉగాదికి అడ్డువచ్చిందా అంటూ పలువురు బీజేపీ అభిమానులు, నెటిజన్లు టీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడుతున్నారు. మరి ఈ విమర్శలపై టీఆర్ఎస్ పెద్దలు స్పందిస్తారో లేదో చూడాలి.