Monday, November 25, 2024

కాకినాడ : కార్పొరేట్లకు మోడీ సర్కార్ అండ : ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్

కార్పొరేట్ సంస్థలకు మోడీ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శైలజనాథ్ అన్నారు. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వాహనాలకు తాడు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నుండి మసిదు సెంటర్, బాలాజీ చెరువు సెంటర్ మీదుగా జిల్లా పరిషత్ సెంటర్ వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం రాష్ట్ర బీసీ నాయకుడు నురుకుర్తి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శైలజానాథ్ మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతూనే పోతున్నాయ‌ని ఆయ‌న మండిపడ్డారు. అలా కాస్త కాస్త‌గా   రోజువారీ పెరుగుదలతో లీటర్ పెట్రోల్ పై రు.6.02, డీజిల్ పై రు.6.40 పెరిగాయ‌ని ఇది సామాన్యుల‌కు మ‌రింత భారంగా కానుంద‌న్నారు.  కార్పొరేట్లు త‌ప్ప మ‌రెవ‌రూ ప‌ట్ట‌ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోలు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను విపరీతంగా పెంచి సామాన్య‌ ప్రజల నడ్డి విరుస్తొందంటూ విమ‌ర్శించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఓ వైపు ముడి చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ మ‌రోవైపు దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆర్ధికంగా కుదేలైన సామాన్యులపై ఇది పెనుభారం మోప‌డ‌మేన‌న్నారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బ్యాంకు రుణ ఎగవేతదారులకు, కార్పొరేట్ శక్తులకు భారీగా తాయిలాలు ఇస్తున్న కేంద్రం ప్రజలపై పెట్రోభారం మోపడం తగదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement