Friday, November 22, 2024

కరోనాకి వ్యాక్సిన్ ఉంది..రోడ్డు ప్రమాదాలకు అలాంటిదేం లేదన్న ‘ఎన్టీఆర్’

కరోనాకి అయినా వ్యాక్సిన్ ఉంది రోడ్డు ప్రమాదాలకు అలాంటివేం లేవన్నారు స్టార్ హీరో ఎన్టీఆర్. సైబరాబాద్ పోలీసుల పెట్రోలింగ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ రహదారి భద్రత మాసంలో భాగంగా సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన‌ ప్రత్యేక కార్యక్ర‌మంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ..నేను ఈ రోజు ఇక్క‌డికి ఓ న‌టుడిగా కాకుండా..రోడ్డు ప్ర‌మాదంలో ఒకే కుటుంబంలో ఇద్ద‌రిని కోల్పోయిన ఓ పౌరుడిగా వ‌చ్చాను. ముందుగా నా అన్న కీర్తిశేషులు నంద‌మూరి జానకి రామ్‌. చాలా జాగ్ర‌త్త ప‌రుడు. కానీ ఎప్పుడోసారి చాలా కేర్‌లెస్ గా కారు న‌డిపిన‌ప్ప‌టికీ ఆయన మాత్రం చాలా జాగ్ర‌త్త తీసుకునే వ్య‌క్తి. జానకిరామ్ జాగ్ర‌త్త‌గా వెళ్తున్న‌ప్ప‌టికీ నేష‌న‌ల్ హైవేపై ఓ ట్రాక్ట‌ర్ రాంగ్ రూట్‌లో రావ‌డం వ‌ల్ల..అర్థాంత‌రంగా ఆ ట్రాక్ట‌ర్ ను న‌డిరోడ్డు మీద ఆపేయ‌డం వ‌ల్ల ఆయ‌న ప్ర‌మాదానికి గుర‌వ‌డం, మ‌ర‌ణించ‌డం జ‌రిగింది.మా నాన్న నంద‌మూరి హ‌రికృష్ణ‌. ఇది నేను కొత్త‌గా చెప్పాల్సిన విష‌యం కాదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు అంద‌రికీ తెలిసిందే. మా తాత‌ను ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మొత్తం ఆయ‌న‌కు ఒక్క ప్ర‌మాదం జ‌రుగ‌కుండా 33వేల కిలోమీట‌ర్లు ఎంతో జాగ్ర‌త్త‌గా ప‌ర్య‌టన కొన‌సాగేలా చేసిన కొడుకు హ‌రికృష్ణ‌. కానీ ఎంతో జాగ్ర‌త్త‌గా ఉన్న అలాంటి వ్య‌క్తి కూడా రోడ్డు ప్ర‌మాదానికి గుర‌వ‌డం, మ‌మ్మ‌ల్ని అర్థాంతరంగా వ‌దిలివెళ్ల‌డం జ‌రిగింది. నేను చెప్పేదేమిటంటే మ‌నం ఎంతో జాగ్ర‌త్త‌గా ఉన్నా..ఎన్నో ప్ర‌మాదాలు పొంచి ఉంటాయి. అందుకే ఒక్క‌సారి వాహ‌నంలో వెళ్లేందుకు మీ ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లేటప్పుడు  ద‌య‌చేసి మీ కుటుంబ‌స‌భ్యుల‌ను గుర్తు తెచ్చుకోండి. మీ రాక కోసం మీ భార్య కాని, మీ త‌ల్లిదండ్రుల‌కు కాని, మీ పిల్ల‌లు కాని మీ మీద ఆధార‌ప‌డ్డా  ఎంతోమంది కుటుంబ‌స‌భ్యులు మీ కోసం ఎదురుచూస్తుంటారు. ఇది కేవ‌లం మ‌నం క‌ఠినంగా నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌డం వ‌ల్ల కాని, క‌ఠిన శిక్ష వేయ‌డం వ‌ల్ల కాని మ‌నం మారం. క‌రోనా లాంటి భ‌యంక‌ర‌మైన వ్యాధికి కూడా వ్యాక్సిన్ ఉంది కాని, రోడ్డు ప్ర‌మాదాల‌కు అలాంటిదేం లేదు. ఇది మ‌న బాధ్య‌త‌గా తీసుకొని, మ‌న‌ల్ని మ‌నం స‌న్మార్గంలో తీసుకెళ్లాలి. మ‌నల్ని మ‌నం మార్చుకోవాలి. పౌరులంద‌రికీ ఇక్క‌డి నుంచి నేను విజ్ఞ‌ప్తి చేసేది ఒక‌టే. బాధ్య‌త‌ర‌హితంగా ప్ర‌వ‌ర్తించ‌కుండా మిమ్మ‌ల్ని మీరు మార్చుకోండి. బాధ్య‌త‌తో మీ కుటుంబ‌స‌భ్యుల కోసం మీరు మారేలా..మీ మార్గాన్ని మార్చుకునేలామిమ్మ‌ల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి.  దేవుడి అన్ని చోట్లా ఉండ‌డు కాబ‌ట్టి త‌ల్లిదండ్రుల‌ను సృష్టించాడు. త‌ల్లిదండ్రులు అన్ని చోట్లా ఉండ‌రు కాబ‌ట్టి గురువును.‌. మ‌న దేశానికి ప‌హారా కాస్తున్న‌ట్వంటి సైనికుల‌ను.. మ‌న ఇంటి బ‌య‌ట ప‌హారా కాసేటువంటి పోలీసుల‌ను సృష్టించాడు.  కానీ పోలీసుల చేతిలో లాఠి పెట్టాడు. ఇది మ‌న‌ల్ని శిక్షించ‌డానికి కాదు. స‌న్మార్గంలో న‌డిపించ‌డానికి. అలాంటి పోలీస్ డిపార్టుమెంట్ ప‌డుతున్న శ్ర‌మ‌ను గుర్తించండి. త‌ల్లిదండ్రుల‌ను ఎంత‌లా గౌర‌విస్తామో..పోలీస్ డిపార్టుమెంట్‌ను కూడా అంత‌లా గౌర‌వించ‌డం పౌరుడిగా మ‌న బాధ్య‌త మ‌న ల‌క్ష్యమ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement