కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు తిరుపతి నగరాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ప్రస్తుత కరోనా పరిస్థితులపై తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వ్యాపార సంఘాలు, ఆటో డ్రైవర్లు, జీపు డ్రైవర్ల యూనియన్‌లతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, నగరపాలక కమిషనర్ గిరీషా, జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడు సమావేశమయ్యారు.
ఈ మేరకు తిరుపతిలోని ప్రతి డివిజన్‌లో కరోనా కేసులు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా వెల్లడించారు. కరోనా వైరస్ కట్టడికి ప్రజలే బాధ్యత తీసుకోవాలని సూచించారు. మంగళవారం నుంచి తిరుపతి నగరంలో మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంటాయని తెలిపారు. తిరుపతి నగరంలో ఓ వైపు కేసులను నియంత్రిస్తూనే మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.