బయో బబుల్‌లోకే కరోనా వైరస్ చొరబడటంతో ఐపీఎల్ ఉన్నపళంగా వాయిదా పడింది. అయితే మిగతా మ్యాచ్‌లు ఎప్పుడు జరుగుతాయన్న అంశంపై క్లారిటీ అయితే లేదు కానీ యూఏఈలో జరగడం మాత్రం పక్కా అని తెలుస్తోంది. మిగతా మ్యాచ్‌ల నిర్వహణ ఈ నెలలో మాత్రం సాధ్యం కాదని లీగ్‌ను వాయిదా వేసే సమయంలోనే బీసీసీఐ స్పష్టం చేసింది. రానున్న నెలల్లో ఖాళీ సమయం చూసి లీగ్‌లో మిగతా మ్యాచ్‌లను పూర్తి చేస్తామని మాత్రం చెప్పింది. ఆ మ్యాచ్‌లు కూడా యూఏఈలో జరగవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దేశంలో కొవిడ్ పరిస్థితులను బట్టి ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఐపీఎల్ వాయిదా నిర్ణయం కేవలం పది నిమిషాల్లోనే అధికారులు తీసుకున్నట్లు తెలుస్తోంది. బయో బబుల్‌లోకే వైరస్ చొరబడిన తర్వాత ఇక లీగ్‌ను కొనసాగించడం అసాధ్యమని ఐపీఎల్ జనరల్ కౌన్సిల్‌తో జే షా స్పష్టం చేశారు. ఆటగాళ్ల భద్రతే ముఖ్యమని, అందులో రాజీ లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే కౌన్సిల్లో ఓ సభ్యుడు మాత్రం లీగ్ కొనసాగాలని పట్టుబట్టినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. అయితే ఇతరులు దానికి ఆమోదం తెలపకపోవడంతో ఆ సభ్యుడు ఏమీ చేయలేకపోయారు. ముంబైతో మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా కరోనా బారిన పడినట్లు తేలడంతో అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేసిన బీసీసీఐ లీగ్‌ను వాయిదా వేసింది. అప్పటికప్పుడు ఒక నగరంలోనే అన్ని టీమ్స్‌కు బయో బబుల్ ఏర్పాటు చేసి మ్యాచ్‌లు నిర్వహించడం అసాధ్యమని బీసీసీఐ భావించింది. బయో బబుల్‌లోకే వైరస్ చొరబడటంతో ఇక మా ముందు మరో మార్గం లేకపోయింది. రానున్న రోజుల్లో ఎంత మంది ఆటగాళ్లు, కోచ్‌లు దీని బారిన పడతారో అన్న ఆందోళన కలిగింది. దీంతో టోర్నీని వాయిదా వేశాం అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.