Saturday, November 23, 2024

ఉక్కు వ‌ద‌లొద్దు – చేజార‌నివ్వొద్దు…

ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రిక ప్ర‌త్యేక క‌థ‌నం…
కుబేరులు దిగుతారు… కొల్లగొట్టేస్తారు
రియల్‌ ఎస్టేట్‌ చేసుకుంటారు
మరింత సంపన్నులవుతారు­
అలసత్వం వద్దు… ఆదమరిస్తే కుబేరుల గుప్పిట్లోకే
కేంద్రానికి చెల్లించాల్సింది రూ.4,350 కోట్లే
స్టీల్‌ ప్లాంట్‌ భూముల విలువ లక్షల కోట్లు
అసోంను చూసి ఆంధ్ర అడుగేయాలి
నుమాలిఘర్‌ రిఫైనరీ కొనుగోలే ఆదర్శం
విశాఖ ఉక్కును ఏపీ ప్రభుత్వం కొనేయాలి
స్టీల్‌ ప్లాంట్‌పై సంపూర్ణ హక్కులు సాధించాలి
ఆ భూములపై రుణాలు తీసుకోవచ్చు
పరిశ్రమలు విస్తరించి లాభాలు తేవచ్చు
నిపుణుల సూచన

విశాఖ ఉక్కు పరిశ్రమలో కేంద్రం తనకున్న రూ. 4,350 కోట్ల విలువైన పెట్టుబడుల్ని ఉపసంహరించుకునే లక్ష్యంలో భాగంగా ఈ కర్మాగారాన్ని అదానీలకో లేక అంబానీలకో కట్టబెట్టే ప్రమాదం స్పష్టమౌతోంది. ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ విలువ 2లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. ఇంతటి విలువైన పరిశ్రమ అంబానీలు, అదానీలకు దఖలైతే నష్టాల పేరిట పరిశ్రమను నిలిపేసి విలువైన వేలాది ఎకరాల భూముల్తో ఈ సంస్థలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహించే అవకాశాలు స్పష్టమౌతున్నాయి. అంతేకాదు.. ఇంత విలువైన పరిశ్రమను తమ గుప్పెట పట్టడం ద్వారా ఈ ఆస్తుల్ని చూపి అంతర్జాతీయ మార్కెట్‌లో మరో రెండు లక్షల కోట్ల వరకు రుణాలు సమీకరించే అవకాశాలుంటాయి. వీటిని మార్కెట్‌లో వివిధ పరిశ్రమల విస్తరణకు వినియోగించి ప్రపంచ కుబేరుల జాబితాలో పోటీపడేందుకు వీరు ప్రయత్నించే అవకాశాల్ని నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఈ పరిశ్రమలో కేంద్ర ప్రభుత్వ వాటాల్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి నిర్వహణా బాధ్యతల్ని తలకెత్తుకోవాలి. దీన్ని రాష్ట్ర సంపదగా మార్చుకోవాలని సూచిస్తున్నారు…

విశాఖపట్నం, : ఆరు నూరై నా.. నూరు ఆరైనా విశాఖ ఉక్కు నుంచి తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవడం తథ్యమని కేంద్రం తేల్చిచెప్పేసింది. ఈ నిర్ణయంలో పునరాలోచనకు అవకాశం లేదని స్పష్టం చేసేసింది. పైగా ఇది జాతీయ దృక్పథంతో తీసుకున్న నిర్ణ యంగా పేర్కొంది. ఇదొక్కటే కాదు… ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు కట్టుబడున్నట్లు స్పష్టం చేసింది. దీంతో విశాఖ ఉక్కుకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయంలో మార్పుండదని తేలిపోతోంది. ఈ పరిశ్రమ పరిరక్షణ కోసం ఎన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మికులు ఎన్ని ఉద్యమాలు చేసినా ఎవరెన్ని త్యాగాలకు పాల్పడ్డా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిళ్ళు తేవడం కంటే భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టిపెట్టడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. విశాఖ ఉక్కు నుంచి కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటే ప్రయోజనం ఎవరికి? ఇందులోని ప్రభుత్వ వాటాల్ని కొనుగోలు చేసే ప్రైవేటు సంస్థలు బహుముఖ లాభాలు పొందే వీలుంటుంది. అలాకాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి పరిశ్రమలోని కేంద్ర ప్రభుత్వ వాటాల్ని కొనుగోలు చేస్తే ఆ ప్రయోజనాలన్నీ రాష్ట్రానికే సిద్ధిస్తాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ సంపదగా మిగిలిపోతుంది. ఇంతా చేస్తే విశాఖ ఉక్కులో కేంద్రానికున్న వాటా రూ.4,350 కోట్లు. కానీ క్షేత్రస్థాయిలో ఈ సంస్థకున్న భూముల విలువే రూ.2 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఈ పరిశ్రమకు 19,700 ఎకరాల భూమి ఉంది. దీని ఉత్పాదక సామర్థ్యం 7.3మిలియన్‌ టన్నులు. దీన్ని సాధించేందుకు రాష్ట్రానికి చెందిన 32మంది ప్రాణాలర్పించారు. లక్షలాది మంది ఉద్యమంలో భాగస్తులయ్యారు. ప్రత్యక్షంగా ఇది 20 వేల మందికి, పరోక్షంగా మరో లక్ష మంది దీనిపై బ్రతు కుతున్నారు. 2002 నుంచి 2015వరకు ఇది అత్యుత్తమ పని తీరు కనబర్చింది. సొంత గనుల్లేక పోవడం, ఎక్కువ వడ్డీకి రుణాలు తేవడం వంటి చర్యలే ఈ సంస్థను నష్టాల బాట పట్టించాయి. పలు ప్రైవేటు ఉక్కు పరిశ్రమలకు కేంద్రం ఉదారంగా గనులు కేటాయించింది. కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న దీనికి గనుల కేటాయింపు జరగలేదు. అలాగే దీని రోజువారి నిర్వహణకు 14శాతం వడ్డీపై రుణాలు తెచ్చింది. ఇది తలకుమించిన ఆర్థిక భారంగా మారింది. అన్నింటికి మించి విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉంది. ఇది తమదన్న భావం రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరు డిలోనూ నెలకొంది. ఈ పరిస్థితుల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగ ణనలోకి తీసుకోవాలి. కేంద్ర వాటా ధనాన్ని రాష్ట్రమే సమ కూర్చాలి. కేంద్రం నుంచి ఈ పరిశ్రమను రాష్ట్రం కొనుగోలు చేయలి. రాష్ట్ర ప్రభుత్వం కడపలో ఒక భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు దశాబ్ధ కాలం నుంచి ఇది సాగుతూనే ఉంది. ఇటీవలె కడప ఉక్కు కోసం పోస్కోతో రాష్ట్రం చర్చలు కూడా నిర్వహించింది. మరికొన్ని జాతీయ, అంతర్జాతీయ ఉక్కు పరిశ్రమల యాజమాన్య ప్రతి నిధులతోనూ మాట్లాడింది. కానీ ఇంతవరకు ఏదీ కార్య రూపం దాల్చలేదు. కడప ఉక్కు పరిశ్రమ లాభదాయకతపై పలు సందేహాలున్నాయి. అక్కడి ముడి ఇనుప ఖనిజం నాణ్య త ప్రమాణాలపై కూడా సందేహాలున్నాయి. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు పట్ల రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అయితే విశాఖ ఉక్కు నుంచే పెట్టుబడులు ఉపసం హరించుకుంటున్న కేంద్రం కడపలో కొత్త పరిశ్రమ కోసం ఎలాంటి ఆర్థిక సహకారం అందించే అవకాశముండదు. ఇదే కాదు.. గతంలో ప్రతిపాదించిన రామయ్యపట్నం పోర్టు వంటి విషయంలోనూ కేంద్రం తన వైఖరి తేల్చిచెప్పేసింది. రాష్ట్రంలో ఒక్క పోలవరం ప్రాజెక్ట్‌ మినహా మరి దేనికీ కేంద్రం నుంచి ఆర్థికసాయం అందదు. అది కూడా రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న కారణంగానే కేంద్రం పోల వరానికి కట్టుబడి ఉంది. వీటన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం పరిగ ణనలోకి తీసుకోవాలి. ఉక్కు పరిశ్రమను చేజారనివ్వకూడదు. ప్రైవేటు సంస్థల పరం కానివ్వకూడదు. అసోం వంటి చిన్న రాష్ట్రమే అతిపెద్ద నుమాలిఘర్‌ రిఫైనరీని కేంద్రం నుంచి కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.9,876 కోట్లు కేంద్రానికి చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అలా ఆ రిఫైనరీని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకుంది. అసోంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ అన్ని విధాలా ముందుంది. ఆర్థికంగానూ ముందంజలో సాగుతోంది. నుమాలిఘర్‌ విలువతో పోలిస్తే విశాఖ ఉక్కు విషయంలో చెల్లింపులు సగం మాత్రమే. దీన్ని రాష్ట్రం తన అధీనంలోకి తెచ్చుకుంటే లక్షల కోట్ల విలువైన పరి శ్రమపై పూర్తి పెత్తనం దఖలౌతుంది. అదే సమయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఇనుప ఖనిజ గనుల కేటాయింపును ప్రభుత్వం సాధించాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం అలసత్వం వహించినా కేంద్రం తన నిర్ణయాన్ని వేగంగా ఆచరణలో పెడుతుంది. అందరూ ఊహించినట్లే అదానీలో అంబానీలో తమ అనుబంధ సంస్థల ద్వారా బరిలో దిగుతారు. కేవలం రూ.5 వేల లోపు కోట్ల పెట్టుబడితోనే విశాఖ ఉక్కును స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత నష్టాల పేరిట పరిశ్రమ నిర్వహణను పక్కనపెడతారు. వేలాది ఎకరాల భూములతో రియల్‌ ఎస్టేట్‌ నిర్వహిస్తారు. భారీ ఆకాశ హర్మ్యాల్ని నిర్మిస్తారు. ఇంతటి సంపదను చూపి మార్కెట్‌ నుంచి మరో రూ.2 లక్షల కోట్ల వరకు ఆర్థిక వనరులు సమీ కరిస్తారు. ప్రపంచ కుబేరుల జాబితాలో పోటీపడతారు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని మరెవరికీ చేజా రనివ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇటీవలె ఆంధ్రప్రభ కూడా ఓ సమగ్ర కథాన్ని ప్రచురించిన విషయం పాఠకులకు విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement