Saturday, November 23, 2024

ఆసుపత్రుల్లో ఉచిత రేడియాలజీ టెస్టులు.. అందించనున్న తెలంగాణ‌ ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ వైద్యరంగ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పును లిఖిస్తున్న తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లు మరో కొత్త సేవలను పేద, సామాన్య ప్రజలకు ఉచితంగా అందించనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లలో పాథాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. రానున్న కొద్ది రోజుల్లో డిజిటల్‌ ఎక్స్‌ రే, డీజిటల్‌ ఈసీజీ, అల్ట్రా సౌండ్‌తో కూడిన పలు రకాల రేడియాలజీ ఆరోగ్య పరీక్షలు కూడా ఉచితంగానే అందనున్నాయి. తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లలో ఉచిత రేడియాలజీ టెస్టులను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని ముందుగా జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో చేపట్టారు. గడిచిన 2021 ఏడాదిలో జీహెచ్‌ఎంసీలో పాథాలజీఆరోగ్య పరీక్షల సేవలను అందిస్తున్న 8 తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లలో రేడియాలజీ టెస్టులను కూడా ప్రవేశపెట్టారు. ఈ వైద్య సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిం చింది. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని మరో 10 టీ.హబ్‌ కేంద్రాల్లో రేడియాలజీ సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఈ నెల 11న ఎంపిక చేసిన టీ. హబ్‌ కేంద్రాల్లో రేడియాలజీ టెస్టులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టనున్నారు. ఎంపిక చేసిన ఈ 10 టీ. హబ్‌లు 151 పీహెచ్‌సీలు/యూపీహెచ్‌సీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల పరిధిలోని ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉచిత రేడియాలజీ ఆరోగ్య పరీక్షల సేవలు విజయవంతం అవుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తోంది. త్వరలోనే సిద్ధిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియాలజీ వైద్య పరీక్షలు రోగులుకు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. ఎక్స్‌ రే, అల్ట్రా సౌండ్‌, ఈసీజీ, 2-డీ ఎకో, మామోగ్రామ్‌ తదితర అధునాతర , ఖరీదైన ఆరోగ్య పరీక్షలు రేడియాలజీ విభాగాలు అందుబాటులోకి వస్తే ఉచితంగా సామాన్య, పేద రోగులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లలో 59 రకాల టెస్టులను ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి రోజూ దాదాపు 1000 మందికి ఒక్కో కేంద్రం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న రేడియాలజీ విభాగాల్లోనే ఇదే తరహాలో రోగులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షల సేవలు అందనున్నాయి.

గర్భంలో శిశువు ఎదుగుదలను తెలుసుకోవాలంటే అల్ట్రాసౌండ్‌ పరీక్షలు తప్పనిసరి. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రేడియాలజీ యంత్రాలు అందుఉబాటులోకి లేకపోవడంతో గర్బిణులను ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లకు పంపిస్తున్నారు. ప్రయివేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లు రూ.3 వేల నుంచి రూ.5వేల దాకా మామాగ్రామ్‌ టెస్టుకు, రూ.600 అల్ట్రాసౌండ్‌ టెస్టుకు, రూ.300 ఈసీజీకి, రూ.1500 2-డీ ఎకో టెస్టుకు వసూలు చేస్తున్నాయి. దీంతో పేద, సామాన్య రోగులు వందలు ఖర్చుపెట్టి టెస్టులు చేయించలేక వైద్యానికి దూరమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లలో ఉచితంగా రేడియాలజీ టెస్టులను కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ తర్వాత త్వరలో అన్ని జిల్లా , ఏరియా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ రేడియాలజీ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా రోగులకు అందుబాటులోకి రానున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement