విశాఖ జిల్లాలో రాజకీయాలు ఉత్కంఠగా మారిపోయాయి. జీవీఎంసీ ఎన్నికల ముంగిట వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ప్రధాన అనుచరుడైన కాశీ విశ్వనాథం వైసీపీలో చేరారు. బుధవారం మధ్యాహ్నం వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో గంటా సైతం వైసీపీలోకి వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఇటీవలే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు.
కాగా గంటా అనుచరుడు కాశీ విశ్వనాథం చేరికతో వైసీపీలో వర్గపోరు మొదలైంది. కాశీ విశ్వనాథం రాకతో మంత్రి అవంతి శ్రీనివాస్ అలిగినట్లు తెలుస్తోంది. వైసీపీలో కాశీ విశ్వనాథం చేరిక కార్యక్రమానికి మంత్రి అవంతి దూరంగా ఉన్నారు. దీంతో మంత్రి అవంతి శ్రీనివాస్‌ను తాను స్వయంగా కలిసి మాట్లాడతానని కాశీ విశ్వనాథం మీడియాకు తెలిపారు. అటు సీఎం జగన్ ఆమోదం తర్వాత త్వరలో గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరతారని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.