- ఆంధ్రప్రభ దినపత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ పేజ్ వన్ స్టోరీ
- హార్థికంలో ఆర్థికం!
- పంచాయతీ ఎన్నికల్లో భారీగా వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు
- దగ్గరుండి మరీ ఓటింగ్‌కు తీసుకొచ్చిన బంధువులు
- సెల్ఫీలు.. ఫోటోలతో సామాజిక మాధ్యమంలో ప్రచారం
- ప్రజాస్వామ్యంలో పరిణతిగా గొప్పలు
- ఈసారి స్థానిక పోరులో పోటాపోటీ పరిస్థితులు
- ప్రతీ ఓటుకూ ప్రాధాన్యం
- వృద్ధులు, దివ్యాంగులకూ పెరిగిన విలువ
- వారి పేరుతో భారీగా నగదు.. తాయిలాలు దండుకున్న ఓటర్లు
- ఓటింగ్ సరళిపై నిపుణుల అభిప్రాయం
కర్నూల్ జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన 89ఏళ్ళ వృద్ధుడు సుబ్బారాయుడు (పేరు మార్చడం జరిగింది) పం చాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఆయన్ను కుటుంబ సభ్యులు మంచంపై పడుకోబెట్టి మరీ పోలింగ్ బూత్‌కు తీసుకొచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లా పులిమేరు గ్రామానికి చెందిన 91ఏళ్ళ వృద్దురాలు దాలమ్మ (పేరుమార్చడం జరిగింది) కుర్చీలో కూర్చోబెట్టి కుటుంబ సభ్యులు పోలింగ్ బూత్‌కు తీసుకొచ్చారు. ఆమె కూడా పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈసారి పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఇలాంటి దృశ్యాలు కంటబడ్డాయి. 90ఏళ్ళుపైబడ్డ వృద్ధులు, సొంతం గా నడవలేని అనారోగ్యవంతులు, వికలాంగులు, పోలింగ్‌కు తరలొ చ్చారు. తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఇదంతా ప్రజాస్వామ్య పరిరక్షణలో వృద్ధులకేర్పడ్డ ఆసక్తిగా ప్రభుత్వ వర్గాలు పెద్దెత్తున ప్రచారం చేస్తున్నాయి. మంచానికే పరిమితమైన వృద్దులు, వికలాంగులు కూడా ఈ సారి పరుగుపరుగునొచ్చి ఓట్లేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నారంటూ గొప్పలు పోతున్నాయి.
కానీ ఇదంతా నాణానికి ఓ వైపు. మరోవైపు వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉంది. పంచాయతీ ఎన్నికల పుణ్యమాని ఇంతవరకు కుటుంబ సభ్యుల ఆదరణకు, గుర్తింపునకు, గౌరవానికి నోచుకోని వయోవృద్ధులకు ఒక్కసారిగా డిమాండ్ వచ్చేసింది. కుటుంబ సభ్యులు వార్ని చక్కగా ఆదరించడం మొదలెట్టారు. ఎప్పుడూలేంది స్నానాలు చేయించి చక్కని బట్టలేసి తయారు చేసి మరీ కూర్చోబెట్టారు. ఇందుక్కారణం ఈ సారి ఎన్నికల్లో పోటీ పెరిగింది. అభ్యర్థులు ఎలాగైనా సరే గెలుపు సాధించాలని కసిగా ప్రయత్నించారు. ఇందుకు ఖర్చుకు కూడా వెనుకాడలేదు. ఒక్కో గ్రామంలో ఒక్కో వార్డుకు నలుగురైదు గురు పోటీపడ్డారు. అలాగే సర్పంచ్ పదవికి మరో నలుగురైదుగురు బరిలో దిగారు. ఇందులో ముగ్గురేసైనా బాగా నగదు పంపిణీ చేశారు. ఇలా చూస్తే ఒక్కొక్క ఓటరుకు ముగ్గురు సర్పంచ్‌లు, ముగ్గురు వార్డు సభ్యుల్నుంచి ఓట్ల కోసం డబ్బులందాయి. ఒక్కొక్కరు మూడు నుంచి పరిస్థితిని బట్టి ఐదేసి వేల వరకు కూడా ఓటర్లకిచ్చారు. ఇలా ఒక్కో ఓటరుకు కనీసం 30వేల వరకు లభించాయి. గతంలో వయోవృద్ధులకు పేద, మధ్యతరగతి కుటుంబాల్లో పెద్దగా ఆదరణుండేదికాదు. వారికెలాంటి సంపాదన లేకపోవడంతో వృధా మనుష్యులుగా చూసేవారు. వృద్దాప్య పింఛన్ల పుణ్యమాని వారిక్కాస్త గౌరవం మొదలైంది. జగన్ అధికారంలోకి వచ్చీరాగానే నెలవారీ వృద్ధాప్య పింఛన్‌ను 2,250కి పెంచేశారు. తదుపరి ఏడాది మరో 250 కలిపారు. దీంతో మూలన మంచానికే పరిమితమైన వృద్ధులక్కూడా ఇప్పుడు నెలనెలా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా 1వ తేదీన రూ. 2500లు లభిస్తున్నాయి. దీంతో ఆ వృద్దులపై తాము చేస్తున్న వ్యయాన్ని కుటుంబ సభ్యులు అదనపు భారంగా పరిగణించడంలేదు. కనీసం వారి తిండి ఖర్చుకైనా వారు తెచ్చుకుంటున్నారన్న యోచనలో ఉన్నారు. ఈ దశలో పంచాయతీ ఎన్నికలు వయోవృద్ధుల పాలి ట పండుగలా మారాయి. ఓట్ల కోసం అభ్యర్థులు పోటెత్తడంతో ఇంతకాలం గుర్తింపులేని వయోవృద్ధులకు ఎక్కడలేని ఆదరణ పెరిగింది. తమ కుటుంబ సభ్యుల జాబితాలో మూలన మంచానికే పరిమితమైన వయోవృద్ధుల్ని కూడా చేల్చి మొత్తంగా అభ్యర్ధుల్నుంచి నగదు తీసుకున్నారు. ఇలా ఇచ్చిన ప్రతి అభ్యర్ధి నుంచి ఆర్థిక ప్రయోజనం పొందిన కుటుంబ స భ్యులు సదరు వయోవృద్దులు పోలింగ్ బూత్కెళ్ళి ఓటేశాడన్న దృవీకరణ కోసం నానా పాట్లు పడ్డారు. ఒక్కొక్క వయోవృద్ధుడి మీద 30వేల వరకు పొందిన కుటుంబ సభ్యులు పోలింగ్ రోజున ఆయన్ను ఎంతో గౌరవంగా, ప్రేమగా కూర్చీల్లో కూర్చోబెట్టి, మంచాలపై పడుకోబెట్టి, వీల్ చైర్లో కూర్చోబెట్టి తోసుకుంటూ పోలింగ్ బూత్‌లకు తీసుకెళ్ళారు. పైగా దీన్నంతా తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి వాట్సప్ గ్రూప్‌లు, ఫేస్బుల్లో విస్తృతంగా ప్రచారానికుంచారు. ఇవన్నీ తమకు ఓట్ల కోసం నగదిచ్చిన అభ్యర్థుల ముందు ధ్రువీకరణ కోసమే తప్ప వీరిపై కుటుంబ సభ్యులకు ఆకస్మాత్తుగా ఊడిపడ్డ ప్రేమాభిమానాలు కాదని పరిశీలకులు ఈ సంఘటనల్ని విశ్లేషిస్తున్నారు. దాదాపుగా వీరంతా స్వతంత్య్రం రావడానికి పూర్వం పుట్టినవారే. వీరికిప్పటికే వయోభారం పెరిగింది. మతిమరుపొచ్చింది. వీరికి ప్రస్తుత చట్టాలు లేదా పంచాయతీ ఎన్నికలపై ఎలాంటి అవగాహన లేదు. బరిలో దిగిన అభ్యర్థుల గురించి కూడా వీరికి తెలీదు. కేవలం కుటుంబ సభ్యుల సూచనలకనుగుణంగా నడుచుకోవడం తప్ప మరే విధమైన అవగాహనలేదు. వీరంతా గ్రామీణులు. చదువుకున్నవారుకాదు. స్వతంత్య్ర సమరంలో భాగస్తులైన నెహ్రూ, గాంధీ, అంబేద్కర్లపై వీరికవగాహనుండొచ్చు. ఆ తర్వాత అధికారంలోకొచ్చిన ఇందిరాగాంధీ గురించి తెలుసుండొచ్చు. అంతకుమించి ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై వీరికెలాంటి అవగాహనుండే అవకాశంలేదు. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు.. ఏ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుందన్న విషయాలపై కూడా వీరికెలాంటి సమాచారం తెలిసే అవకాశంలేదు. కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తిని విశ్రమించడం మినహా మరో యావలేదు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయన్న ధ్యాస లేదు. తమకూ ఓటుహక్కుందన్న విషయం గుర్తులేదు. అలాంటి వీరందర్నీ ఎన్నికల సందర్భంగా ఆకస్మాత్తుగా కుటుంబ సభ్యులు స్నానాలు చేయించి మంచి బట్టలు కట్టి పోలింగ్ బూత్‌లకు తోడ్కొనివెళ్ళారు. ఇప్పటివరకు చీదరించుకుంటున్న వారు సైతం ఎంతో గౌరవంగా చూడ్డం మొదలెట్టారు. ఈ వ్యత్యాసం ఎందుకేర్పడిందో వారిక్కూడా అర్థంకావడంలేదు. వయోవృద్ధులు ఓట్లేసేందుకు కుటుంబ సభ్యుల్లో ఒకర్ని సహాయకులుగా పోలింగ్ ఆఫీసర్ అనుమతిస్తారు. దీంతో తమకిష్టమైన అభ్యర్థి గుర్తుమీద తమ కుటుంబ సభ్యుడైన వృద్ధులకు బదులుగా వెంట వెళ్ళిన వ్యక్తులు ఓటేస్తారు. అంతకుమించి వీరెవరూ సొంతంగా ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోగలిగే పరిస్థితి లేదని వీరు విశ్లేషిస్తున్నారు.