రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. స్థానిక పోరులో పల్లె గెలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో ఫిబ్రవరి 9, 13, 17, 21వ తేదీలలో నాలుగు దశల్లో నిర్వహించిన పల్లెపోరు ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఆదివారం జరిగిన తుది దశ ఎన్నికల్లోను అధికార పార్టీ ప్రభంజనం సృష్టి ంచింది. వైసీపీ మద్దతుదారులు అత్యధిక సంఖ్యలో విజయం సాధించారు. చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 16 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 2743 పంచాయతీలకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 82.85 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09 శాతం, అతిస్వల్పంగా నెల్లూరు జిల్లాలో 76 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో జోరు వర్షం కురుస్తున్నప్పటికీ ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోను ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 12.30 గంటల్లోపే 60 శాతం దాటింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసిన పోలింగ్‌లో అత్యధిక మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడు దశలతో పోలిస్తే చివరిదైన నాల్గవదశలో ఓటింగ్ శాతం మరింత పెరిగింది. సాయంత్రం 4.30 గంటల నుండి ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా రాత్రి 7 గంటలకే మైనర్ పంచాయతీల్లో ఫలితాలు వెలువడ్డాయి. రాత్రి పొద్దుపోయే వరకు అందిన సమాచారం మేరకు 85 శాతం పైగా స్థానాల ను వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. టీడీపీ స్వల్ప స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.
నాల్గవ దశలోనూ.. ఫ్యాన్ గాలి
పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ హవా కొనసాగింది. నాలుగు దశల్లోనూ ఆ పార్టీ ప్రభంజనం స్పష్ట ంగా కనిపించింది. ఓటర్లంతా అత్యధిక సంఖ్యలో ఆ పార్టీ మద్దతుదారులకే పట్టం కట్టారు. దీంతో ఆదివారం జరిగిన నాల్గవదశ ఫలితాల్లోను ఫ్యాన్ దుమ్మురేపింది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ 10 నుంచి 15 శాతం ఫలితాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తొలిదశలో 2616 పంచాయతీల్లో వైసీపీ విజయం సాధించగా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 510 స్థానాలకే పరిమితమైంది. అదేవిధంగా రెండవదశలో వైసీపీ 2654, టీడీపీ 534, మూడవదశలో వైసీపీ 2604, టీడీపీ 525 స్థానాల్లో గెలుపొందింది. నాల్గవదశలో కడపటి సమాచారం అందే సమయానికి 2 వేలకు పైగా స్థానాల్లో వైసీపీ విజయం సాధించి తన జోరును కొనసాగించింది. టీడీపీ 210 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించింది. పూర్తి స్థాయి ఫలితాలు వెలువడాల్సి ఉంది.
వైసీపీ హవా
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మద్ద తుదారులు పల్లెపోరులో పైచేయి సాధించారు. అంచనాలకు మించి అధికార పార్టీకి ఘనవిజయాన్ని అందించారు. ముఖ్యంగా ఆదివారం జరిగిన చివరి పోరులో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో 108 పంచాయతీల కు ఎన్నికలు జరుగగా.. 108 స్థానాలను వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకుని రికార్డు సృష్టి ంచారు. నామినేషన్ల ప్రక్రియలోనే 90 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. ఎన్నికలు జరిగిన 18 చోట్ల వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన నారావారిపల్లిలోని కందుల వారిపల్లి పంచాయతీలో టీడీపీ మద్దతుతో బరిలోకి దిగిన బి.లక్ష్మి భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో సొంత పంచాయతీలో చంద్రబాబు పట్టు నిలుపుకున్నట్లయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరోసారి తన హవా చాటుకున్నారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సొంత గ్రామమైన కొడవలూరు మండలం రాజుపాళెంలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. 14 వార్డుల్లో టీడీపీ ఓటమి పాలైంది. సర్పంచ్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో బలమైన టీడీపీ నాయకులు ఉన్న రాజుపాళెంలో సైకిల్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అలాగే నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరి ధిలో 17 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరోసారి తన సత్తా చాటుకున్నారు. గ్రామీణ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక పంచాయతీలను ఒకే పార్టీ కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టి ంచారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్‌లో టీడీపీకి మరోసారి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.
చెదురుమదురు సంఘటనలు
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి మూడు దశలతో పోలిస్తే ఆదివారం జరిగిన నాల్గవదశ ప్రశాంత వాతావరణంలో జరిగింది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం పైనాపురం పంచాయతీలో జరుగుతున్న ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్త పరిస్థి తి నెలకొంది. అలాగే కృష్ణా జిల్లా నూజివీడు మండలం పాతరావిచర్ల పోలింగ్ కేంద్రం వద్దకు వాలంటీర్లు పదేపదే రావడంతో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. అలాగే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఏర్పేడులో ఏజెంట్ల మధ్య వివాదం తలెత్తింది. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో కొంతసేపు పోలింగ్ నిలిచిపోయింది. వివాదం సర్దుమణిగిన తరువాత తిరిగి పోలింగ్ ప్రారంభమైంది. అలాగే అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలోని కోడిపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో ఉద్రిక్త పరిస్థి తి తలెత్తింది. సర్పంచ్ అభ్యర్థుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పోలింగ్ కేంద్రాల్లోని ఏజెంట్లతో ఘర్షణకు దిగారు. దీంతో ఆ ప్రాం తంలో కొంతసేపు ఆందోళనకర పరిస్థి తి ఏర్పడింది. అలాగే గుంటూరు జిల్లా క్రోసూరు మండలం గుడిపాడు పరిధిలో వైసీ పీ, టీడీపీల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.
జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం
వ. నెం. జిల్లా పేరు పోలింగ్ శాతం
—————————————————————————-
1. శ్రీకాకుళం 83.59
2. విజయనగరం 87.09
3. విశాఖపట్నం 86.94
4. తూర్పుగోదావరి 80.30
5. పశ్చిమగోదావరి 83.76
6. కృష్ణా 85.64
7. గుంటూరు 84.92
8. ప్రకాశం 82.04
9. నెల్లూరు 76.00
10. చిత్తూరు 78.77
11. కడప 85.13
12. కర్నూలు 78.41
13. అనంతపురం 84.49
—————————————————————————-
సరాసరి 82.85
—————————————————————————-
అమరావతి : గెలిచిన పల్లె….ముగిసిన పంచాయతీ
Advertisement
తాజా వార్తలు
Advertisement