ఆంధ్రప్రదేశ్ లో క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం కావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది. అయితే అదేమంత సులభం కాదు. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ ఏపీలో మాత్రం అత్యంత బలహీనంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం కావడానికి అన్ని శక్తులూ ఒడ్డి ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం మాత్రం సానుకూలంగా రావడం లేదు. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికలే అందుకు తార్కానం. రాష్ట్రంలో ఉనికి చాటుకోవాలన్న ఉద్దేశంతో జనసేనతో పొత్త పెట్టుకుని పంచాయతీ బరిలో దిగినా కమలం పార్టీ నామమాత్రపు ప్రభావాన్ని కూడా చూపలేకపోయింది. రాష్ట్రంలో కమలం పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.ఇందుకు ప్రధాన కారణం బీజేపీ పార్టీ పరంగా, కేంద్రంలోని మోడీ సర్కార్ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన వెంటనే విభజిత ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పట్ల గతంలో ఎన్నడూ లేని విధంగా సానుకూల పవనాలు వీచాయి. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధించిందంటే అందుకు కారణం ఆ పార్టీ బీజేపీతో పొత్త పెట్టుకోవడం ప్రధాన కారణమని చెప్పక తప్పదు. అయితే ఆ తరువాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా కూడా రాష్ట్రానికి ఇసుమంతైనా న్యాయం చేయలేదన్న భావన ఆంధ్రుల్లో బలంగా నాటుకు పోయింది. పైగా ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే డివిజన్, ఇఫ్పుడు విశాఖ ఉక్కు ఇలా ఏ విషయంలో తీసుకున్నా కేంద్రంలోని మోడీ సర్కార్ కానీ, బీజేపీ పార్టీ కానీ ఏపీకి మెండి చేయి చూపుతూనే వచ్చాయి. ఈ కారణంగానే ఏపీలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతున్నది. ఏపీలో బీజేపీకి ఇసుమంతైనా సానుకూల వాతావరణం లేదనడానికి ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాలే స్పష్టమైేన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అమరావతి విషయంలో, విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే…ఏపీలో ఆ పార్టీకి కనీస ఉనికిని కూడా ప్రశ్నార్ధకం చేస్తున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను మినహాయిస్తే దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలలోనూ కూడా కమలం పార్టీ బలోపేతం అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకూ దక్షిణాదిలో కమలం పార్టీకి ఉన్న బలం అంతంతమాత్రమే అనుకునే పరిస్థితి కానీ ఇప్పుడు తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ వంటి రాష్ట్రాలలో ఆ పార్టీ గణనీయంగా బలపడిందనే చెప్పాలి. ఒక్క ఏపీలో మాత్రం కమలం పార్టీ రోజు రోజుకూ బలహీనపడుతున్నది. ఏపీలో పార్టీ బలోపేతం కోసం కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం అంత తేలిక కాదని పరిశీలకులు చెబుతున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ తర్వాత మాట మార్చడం, రైల్వే జోన్‌పై తాత్సారం, వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకోవడం లాంటి వాటితో రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి షాకిచ్చారు. రాష్ట్రాన్ని విభజించిన తరవాత కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఆ పార్టీకి సున్నా చుట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ కంటే బీజేపీయే ఎక్కువగా రా ష్ట్రానికి అన్యామయం చేసిందన్న భావన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహమే ఎన్నికల్లో ప్రస్ఫుటంగా ప్రతిఫలించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement