Friday, November 22, 2024

అకాల వర్షం అన్నదాతను ముంచేసింది!

అకాల వర్షాలు అన్నదాతను నట్టేట ముంచేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షాలకు మిర్చి, పత్తి, కంది, శనగ పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు మామిడి పూత రాలిపోయింది. రైతులు తీవ్రంగా నష్ట పోయారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పిడుగుపాటుకు యువరైతు గుండెపోటుతో మృతిచెందాడు. చలికాలం పోయి ఎండాకాలం ఇప్పడి ప్పుడే ప్రారంభమవుతున్న తరుణంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో గురువారం రాత్రి, శుక్రవారంనాడు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసాయి. శుక్రవారం నాడు హైదరాబాద్‌లో మధ్యాహ్నం వర్షం కురవగా, నిజమా బాద్‌లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కుమరంభీం, కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని ప్రాంతాల్లో వాన కురిసింది. శనివారం కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌లో కురిసిన అధిక వర్షాలకు రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. మళ్లిd రబీ పంటచేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కురుస్తున్న అకాల వర్షాలతో మిర్చి, మామిడి తోటలతో పాటు కంది, శనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పత్తి పంట ఉండడంతో వర్షాలకు తడిస్తే.. నల్లగా మారిపోయి.. విక్రయించుకునేందుకు కూడా అనువుగా ఉండదని రైతులు వాపోతున్నారు. మామిడి పూత దశలో ఉండడంతో వాతావరణ మార్పుల వలన కురిసే వర్షాలు, వచ్చే గాలులకు పూత మొత్తం రాలిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెబుతున్నారు.
పిడుగుపాటుకు యువరైతు మృతి
శుక్రవారం నాడు ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం, తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌ అనే యువరైతు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. మధ్యాహ్నం పొలంలో పనులు చేస్తుండగా ఉరుములు, మెరుపులు రావడంతో వెంకటేష్‌ పనిచేస్తున్న సమీప ప్రాంతంలో పిడుగు పడింది. ఆ శబ్దానికి గుండెపోటుకు గురై మృతి చెందినట్టు భావిస్తున్నారు. చికిత్స నిమిత్తం కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం… వర్ష సూచన
ఉత్తర కోసా ్తఆంధ్రా, దాని పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. శ్రీలంక తీరం నుండి ఉత్తర తమిళనాడు తీరప్రాంతం వరకు ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద తక్కువ ఎత్తులో వీచే తూర్పు గాలులలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement