Wednesday, December 25, 2024

న్యూఢిల్లీ : బలహీన విపక్షాలతో ప్రజాస్వామ్యానికి ముప్పు!

చట్ట సభల్లో సీట్ల లెక్కలతో కాకుండా సిద్ధాంత పరమైన అంశాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై విపక్షాల గొంతు బలంగా వినిపించాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో ఎంతైనా ఉంది. విపక్షాలలో అటువంటి శక్తి, బలం సన్నగిల్లితే ఆ పరిస్థితి ప్రజాస్వామ్యానికి ముప్పుగా చెప్పుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం భారత దేశంలో దాదాపుగా అలాంటి పరిస్థితే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగంగా ప్రైవేటీకరణ గురించి విస్పష్ట ప్రకటన చేసినా…విపక్షాల నుంచి పెద్దగా స్పందన కానరావడం లేదు. ప్రభుత్వం వ్యాపారం చేయబోదనీ, ప్రభుత్వ రంగ సంస్థల భారాన్నీ, బాధ్యతను మోయదని మోడీ కుండ బద్దలు కొట్టినా విపక్షాలు పెద్దగా వ్యతిరేక గళం వినిపించలేదు. ప్రైవేటీ కరణను అడ్డుకుని తీరుతామన్న రాజకీయ సంకల్పాన్ని ప్రకటించలేదు. విపక్షాల నుంచి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటనలు వెల్లువెత్తలేదు. ప్రజాభీష్టం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉందని విస్పష్టంగా తెలిసినా కూడా ప్రతిపక్షాలు ప్రజాభీష్టం మేరకు స్పందించడం లేదు. ఇది వాటి బలహీనతకు, పోరాట పటిమను కోల్పోయాయనడానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలు సాగుతున్నా…ఆ రాష్ట్రంలో కూడా విపక్షాల నుంచి సరైన ప్రతిస్పందన రావడం లేదు. ప్రజా ఉద్యమానికి విపక్షాలు అండగా నిలుస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. కేవలం ప్రకటనలకే పరిమితమై ఉద్యమాల నిర్మాణానికి దూరంగా ఉంటున్నాయి.  దేశంలో ప్రతి ప్రభుత్వ రంగ సంస్ధకూ ఒక చరిత్ర ఉంది. ప్రజా సేవలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటూ వచ్చాయి. అటువంటి ప్రభుత్వ రంగ సంస్ధలను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసి…లాభ సాటి సంస్థలను కూడా వాటి స్థిర, చరాస్థులతో సహా ప్రైవేటుకు అప్పగించాలన్న ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం పట్ల విపక్షాలు ఎందుకు ఉదాశీనంగా, నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి, ప్రజా బాహుల్యంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదు? ఈ ప్రశ్నలకు సహేతుక సమాధానం దొరకకపోవడమే…వాటిలో రాజకీయ చైతన్యం, ప్రజా పక్షాల నిలబడి పోరాడాలన్న తపన తగ్గాయా అన్న అనుమానాలు వ్యక్తం అవ్వడానికి కారణమౌతున్నాయి.  ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో పాటు….విపక్ష అభిప్రాయం కూడా ప్రజా బాహుల్యంలో విస్తృతంగా చర్చ జరగాలి.  అప్పుడే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మోడీ వ్యవహార శైలి కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు.  భావోద్వేగంతో మాట్లాడం ప్రధాని వెూడీకి అత్యంత సహజమైన విద్య. ఆయన భావోద్వేగాలతో ప్రకటనలు చేస్తారు. ప్రజలను, ప్రతిపక్షాలను సెంటిమెంట్‌తో కొడతారు.  తాను జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చానని, ఓ చాయ్ వాలానని అంటారు. పార్టీ కార్యకర్త నుంచి ప్రధానమంత్రి వరకూ రావడానికి మధ్య ఎన్ని ముళ్ల దారుల్ని అధిగమించానో చెబుతారు.  జనం కూడా అలాగే కష్టపడాలని ఉద్భోదిస్తారు.  అంతే కానీ ఆయన జన సామాన్యానికి మేలు కలిగే పథకాల రూపకల్పన కంటే కార్పోరేట్లకు ప్రయోజనం కలిగించే పథకాల రూపలక్పన గురించే అధికంగా ఆలోచిస్తారు.   సాగు చట్టాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం నమ్మకూడదని, గతంలో కూడా వాజపేయి హయాంలో ఇలాంటి ప్రచారం చేశారని పదేపదే చెప్పడం ద్వారా రైతుల ఆందోళనలో అర్థం లేదని వాదిస్తూ వచ్చారు.  ఆయన వాదనా చాతుర్యం, ప్రసంగ పటిమ లావాలా మరుగుతున్న అంశాలపై క్షేత్ర స్థాయిలో చర్చ జరగకుండా చేయడానికి ఉపయోగపడుతున్నాయి. అందుకే ప్రస్తుతం దేశాన్ని రగిలిస్తున్న అంశాల గురించి జరగాల్సినంతగా చర్చ జరగడం లేదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు తమ బాధ్యతను ఉద్దేశ పూర్వకంగా విస్మరించాయని పరిశీలకులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement