హామీలు అమలు చేయండి.. యువతకు ఉద్యోగాలివ్వండి!
- మెట్పల్లిలో ఎమ్మెల్యే డా. సంజయ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా
- జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి..
- స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
- పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం కలిగించే జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్
మెట్పల్లి, ఆంధ్రప్రభ: ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో శనివారం మెట్పల్లిలో భారీ ధర్నా నిర్వహించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడకుండా ఉద్యోగ నియామకాలకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జాబ్ క్యాలెండర్ ఎక్కడ?
ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని డా. సంజయ్ గుర్తుచేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలం గడుస్తున్నా స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగాల కోసం యువత ఎదురుచూస్తున్న నేపథ్యంలో శాఖల వారీగా ఖాళీలను ప్రకటించి, నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు.
జీవో 97ను రద్దు చేయాలి
పాలిటెక్నిక్ విద్యార్థులు, వారి విద్యా వ్యవస్థకు నష్టం కలిగించే జీవో నెంబర్ 97ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మొండివైఖరిని వీడి, వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
స్కాలర్షిప్లు విడుదల చేయాలి
స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో అందక పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని డా. సంజయ్ అన్నారు. పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులకు స్కూటీలు అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.
యువతను మోసం చేయొద్దు
యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు అవసరమైన సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల, ఉద్యోగ నియామకాలు, స్కూటీల హామీ అమలు, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలతో పాటు జీవో 97 రద్దు కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
