అక్రమంగా నిల్వ చేసిన టేకు కలప పట్టివేత

మురిమడుగులో ఇంట్లో రూ.15 వేల విలువైన కలప సైజుల స్వాధీనం

జన్నారం, ఆంధ్రప్రభ : జన్నారం అటవీ డివిజన్‌ పరిధిలోని మురిమడుగు గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన టేకు కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన దుబ్బరాజం ఇంట్లో సుమారు రూ.15 వేల విలువైన టేకు కలప సైజులను స్వాధీనం చేసుకున్నట్లు ఇందనపల్లి ఇన్‌చార్జి అటవీ క్షేత్రాధికారి బాబా ఖాదర్‌ వలీ బుధవారం తెలిపారు.

సమాచారం మేరకు గ్రామ అటవీ ప్రాంత అధికారి రాజేశ్వర్‌తో కలిసి దుబ్బరాజం ఇంటికి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. అక్కడ అక్రమంగా నిల్వ చేసిన టేకు కలప సైజులను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం కలపను జన్నారం అటవీ క్షేత్ర కార్యాలయానికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.