చైనాకు 2వేల కోట్ల చిప్స్ అక్రమ రవాణా.. టెక్ CEO అరెస్ట్

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: అమెరికా ఎగుమతి నిబంధనలను (Export Rules) తీవ్రంగా ఉల్లంఘిస్తూ, నిషిద్ధ అత్యంత శక్తివంతమైన ఎన్‌విడియా (Nvidia) ఏఐ చిప్స్ సర్వర్లను చైనాకు అక్రమంగా తరలించేందుకు కుట్ర పన్నిన ఆరోపణలపై ఓ అమెరికన్ టెక్ సంస్థ సీఈఓను అమెరికా ఫెడరల్ అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు 300 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 2,500 కోట్ల విలువైన ఏఐ సర్వర్లను అక్రమంగా చైనాకు పంపించేందుకు ప్రయత్నించినట్లు ఆయనపై తీవ్ర ఆరోపణలు నమోదయ్యాయి. ఎర్త్‌మేడ్ కంప్యూటర్ సీఈఓ గ్రెగ్ లుయ్ అరెస్ట్ కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ‘ఎర్త్‌మేడ్ కంప్యూటర్’ (Earthmade Computer) కంపెనీ సీఈఓ, 38 ఏళ్ల గ్రెగ్ లుయ్ (Greg Lui) ను అమెరికన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2023 నుండి 2024 మధ్య కాలంలో అమెరికా ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే అడ్వాన్స్డ్ ఏఐ సర్వర్లను చైనాకు చేరవేసేందుకు లుయ్ ప్రయత్నించాడని అమెరికా న్యాయశాఖ (DoJ) వెల్లడించింది.

ఈ భారీ కుట్ర కోసం నకిలీ పత్రాలు (Fake Documents) కూడా సృష్టించినట్లు అధికారులు ఆరోపించారు. తనిఖీలు తప్పించుకునేందుకు మూడో దేశాల ద్వారా స్మగ్లింగ్అమెరికా అధికారుల నిఘా.. తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఈ సర్వర్లను నేరుగా చైనాకు పంపకుండా, ముందుగా మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేసి, అక్కడి నుంచి సీక్రెట్‌గా చైనాకు తరలించేలా మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ సర్వర్లలో అత్యంత వేగవంతమైన, అత్యాధునిక సాంకేతికత కలిగిన Nvidia A100, H100 వంటి శక్తివంతమైన ఏఐ చిప్‌లు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

సైనిక అవసరాల నిరోధానికే అమెరికా ఆంక్షలు అత్యంత శక్తివంతమైన ఈ ఏఐ టెక్నాలజీ చైనా సైనిక (Military AI), నిఘా అవసరాలకు ఉపయోగపడకుండా ఉండేందుకు అమెరికా ప్రభుత్వం ఎన్‌విడియా అధునాతన చిప్‌ల ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది. అయితే ఈ నిబంధనలను తుంగలో తొక్కి స్మగ్లింగ్‌కు పాల్పడినందుకు గ్రెగ్ లుయ్‌పై అక్రమ రవాణా, మనీ లాండరింగ్, యుఎస్ ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ యాక్ట్ ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు. ఈ ఆరోపణలు కోర్టులో రుజువైతే ఆయనకు గరిష్ఠంగా 50 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఆధిపత్యం కోసం అమెరికా, చైనా మధ్య తీవ్ర పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.