Illegal-Egg-Collection-Racket-Hyderabad-Saroor-nagar| వ్యభిచార రాకెట్‌గా భావిస్తే.. అండాల సేకరణ గుట్టురట్టు! మహిళల ఆరోగ్యంతో చెలగాటం?

  • అండాల సేకరణ వ్యవహారం.. మాతృత్వ‌పు ఆశ‌ల నుంచి నేరాల వరకు ఎన్నో ప్రశ్నలు!
  • వ్యభిచార రాకెట్‌గా భావిస్తే.. మరో కోణం వెలుగులోకి : సీపీ సుమ‌తి
  • ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసం పోలీసులు ఎదురుచూపు!
  • అండాల సేకరణ ముసుగులో మహిళల ఆరోగ్యంతో చెలగాటం!
  • మాతృత్వపు ఆశలు.. మహిళల ఆరోగ్యం!
  • హార్మోనల్‌ ఇంజెక్షన్ల వినియోగంపై అనుమానాలు.. ఎఫ్ఎస్ఎల్‌ నివేదిక కోసం ఎదురుచూపులు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, క్రైమ్ ప్ర‌తినిధి : మాతృత్వం.. ప్రతి మహిళ జీవితంలో అత్యంత సున్నితమైన, భావోద్వేగాలతో ముడిపడిన అంశం. సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు వైద్య విజ్ఞానం అందిస్తున్న ఆధునిక సాంకేతికత ఒక వరంగా మారింది. సహాయక పునరుత్పత్తి విధానాల (ఏఆర్టీ), ఐవీఎఫ్‌ చికిత్సల ద్వారా ఎన్నో కుటుంబాల్లో సంతాన సాఫల్యం సాధ్యమవుతోంది. అయితే ఇదే వైద్య విధానాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు మహిళల శరీరాలను వ్యాపారానికి వనరులుగా మార్చుకుంటున్నారా? వారి ఆర్థిక అవసరాలను పెట్టుబడిగా చేసుకుని అండాల సేకరణ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారా? సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసిన అండాల సేకరణ వ్యవహారం ఇలాంటి అనేక ప్రశ్నలను తెరపైకి తెచ్చింది.

వ్యభిచార రాకెట్‌గా భావిస్తే.. మరో కోణం వెలుగులోకి!

తొలుత వ్యభిచార సంబంధిత రాకెట్‌గా అనుమానించి పోలీసులు విచారణ ప్రారంభించగా.. క్రమంగా అక్రమ అండాల సేకరణ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సీపీ బి. సుమతి వెల్లడించారు. ఎగ్‌ డొనేషన్‌ పేరుతో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగాయా? మహిళలను ప్రలోభపెట్టి అండాల సేకరణకు ఉపయోగించుకున్నారా? ఈ వ్యవహారం వెనుక ఏఆర్టీ కేంద్రాలు, ఫెర్టిలిటీ కేంద్రాలు, మధ్యవర్తుల పాత్ర ఎంతవరకు ఉంది? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో హార్మోనల్‌ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకోవడం మరింత కీలకంగా మారింది. మహిళలకు అండాల ఉత్పత్తిని పెంచే ఇంజెక్షన్లు ఇచ్చారా? వైద్యుల పర్యవేక్షణ లేకుండా చికిత్సలు నిర్వహించారా? అన్నది తేలాల్సి ఉంది. స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్లపై ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చిన తర్వాతే ఈ అంశాలపై స్పష్టత రానుంది.

Also Read అండాల దందా.. హాస్ట‌ల్ అంటే అమ్మాయిల‌కు ద‌డ‌! https://prabhanews.com/illegal-egg-collection-hyderabad/

మహిళ ఆరోగ్యానికి ముప్పు ఎంత?

అండాల సేకరణ ప్రక్రియలో హార్మోనల్‌ మందులు, ఇంజెక్షన్లను వైద్యుల సూచన మేరకు నిర్దిష్ట మోతాదులో ఉపయోగిస్తారు. అయితే వీటి వినియోగంలో నిర్లక్ష్యం జరిగితే అండాశయాలు అతిగా స్పందించే ఓవేరియన్‌ హైపర్‌స్టిమ్యులేషన్‌ సిండ్రోమ్‌ (ఓహెచ్ఎస్ఎస్‌) వంటి సమస్యలు తలెత్తవచ్చు. కడుపు ఉబ్బరం, కడుపునొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలతో మొదలై.. తీవ్రమైన సందర్భాల్లో శరీరంలో ద్రవాలు పేరుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, రక్తం గడ్డకట్టడం వంటి ప్రమాదాలు ఎదురుకావచ్చు. అండాల సేకరణ సమయంలోనూ అరుదుగా రక్తస్రావం, ఇన్ఫెక్షన్‌ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ముందస్తు ఆరోగ్య పరీక్షలు, చికిత్స సమయంలో నిరంతర పర్యవేక్షణ, ప్రక్రియ అనంతరం వైద్యుల ఫాలోఅప్‌ ఎంతో అవసరం. అక్రమంగా, పర్యవేక్షణ లేకుండా ఇలాంటి ప్రక్రియలు నిర్వహిస్తే మహిళల ఆరోగ్యానికి ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది.

మాతృత్వపు ఆశలు.. మహిళల ఆరోగ్యం!

ఒకవైపు సంతానం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దంపతులు.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో అండాల దాతలుగా మారుతున్న మహిళలు. ఈ రెండు వర్గాల భావోద్వేగాలను, అవసరాలను ఆసరాగా చేసుకుని మధ్యలో అక్రమార్కులు లాభాలు పొందుతున్నారా? అనేది ఈ వ్యవహారంలో ప్రధానంగా పరిశీలించాల్సిన అంశం. తల్లి కావాలనుకునే వారు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నప్పటికీ.. అండం ఎక్కడి నుంచి వస్తోంది? దాతకు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించారు? చట్టబద్ధంగా సేకరించారా? అనే అంశాలను కూడా తెలుసుకోవాలని సీపీ బి. సుమతి చేసిన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ వ్యవహారంలో అందరినీ నిందితులుగా పరిగణించలేమని, ఎవరి పాత్రకు సంబంధించి ఆధారాలు లభిస్తాయో వారినే నిందితులుగా గుర్తిస్తామని ఆమె స్పష్టం చేశారు.

దర్యాప్తుతో బయటపడాల్సిన నిజాలు!

ఈ కేసులో హార్మోనల్‌ ఇంజెక్షన్లు బాధిత మహిళలకు ఇచ్చారా? అండాల సేకరణ ఎక్కడ జరిగింది? ఎంతమంది మహిళలను సంప్రదించారు? వారి నుంచి సమ్మతి తీసుకున్నారా? మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారా? ఏఆర్టీ కేంద్రాలు, ఫెర్టిలిటీ కేంద్రాల మధ్య సంబంధాలు ఏమిటి? అనే అంశాలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఫోరెన్సిక్‌ నివేదిక, వైద్య రికార్డులు, బాధిత మహిళల వాంగ్మూలాలు ఈ దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి. ఈ వ్యవహారం కేవలం ఒక నేర కేసుగా ముగియకుండా.. మహిళల పునరుత్పత్తి ఆరోగ్య హక్కులు, వైద్య రంగంలో పారదర్శకత, సంతాన సాఫల్య చికిత్సలపై పర్యవేక్షణ అవసరాన్ని గుర్తు చేస్తోంది. మాతృత్వపు ఆశలకు వైద్య విజ్ఞానం అండగా నిలవాలి తప్ప.. మహిళల శరీరాలు అక్రమ వ్యాపారానికి సాధనాలుగా మారకూడదు.