కొత్తచెరువులో అక్రమ దందా?

  • జేసీబీలతో పూడికతీత.. రాత్రివేళల్లో తరలింపు
  • చర్యలు తీసుకుంటామన్న పోలీసులు

వెల్దండ, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తచెరువులో అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి. చెరువులో జేసీబీలతో పూడికతీసి, ఇసుకను రాత్రివేళల్లో ఫిల్టర్‌ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడుతున్న వారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

చెరువు నుంచి ఇసుకను అక్రమంగా తరలించడం వల్ల చెరువుకు గండిపడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భూగర్భ జలాలు తగ్గి భవిష్యత్‌లో గ్రామంలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విషయమై వెల్దండ ఎస్‌ఐ యుగేందర్‌రెడ్డిని సంప్రదించగా.. ఇసుక తవ్వకాలు, తరలింపునకు ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వి తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.