ఇచ్చాపురం మండలంలో విద్యాసంస్థలకు రేపు సెలవు

బహుదా నదిలో మూడో ప్రమాద హెచ్చరిక దాటడంతో నిర్ణయం

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : బహుదా నదిలో వరద ఉద్ధృతి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటడంతో ఇచ్చాపురం మండలంలోని అన్ని విద్యాసంస్థలకు, అంగన్‌వాడీ కేంద్రాలతో సహా శుక్రవారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులను బట్టి విద్యాశాఖ అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా సంబంధిత శాఖల అధికారులు సెలవు ప్రకటించవచ్చని పేర్కొన్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ సహా అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండి విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.