• బోన్లకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న చిరుత
  • రోడ్డు దాటుతున్న దృశ్యాలు కెమెరాలో నిక్షిప్తం
  • అటవీశాఖ–పోలీసుల గాలింపు ముమ్మరం

హైదరాబాద్ లో చిరుతపులి సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. గోల్కొండ ప్రాంతంలోని ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో ఓ చిరుతపులి రోడ్డు దాటి వెళ్లిపోతున్న దృశ్యం సీసీటీవీ కెమెరాలకు చిక్కింది. ఈ దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, చిరుతపులి తారామతి బారాద్ వెనక నుంచి మూసీ నది వైపు వెళ్ళినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు గోల్కొండ పోలీసులకు సమాచారాన్ని అందించి అప్రమత్తం చేశారు.

గత కొన్ని రోజులుగా మంచిరేవుల, నార్సింగి ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. గ్రేహౌండ్స్ ప్రాంతంలో నాలుగు బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, ఆ చిరుతపులి బోన్లకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. అదే చిరుతపులి ఇప్పుడు ఇబ్రహీంబాగ్ ప్రాంతంలో కనిపించిందని అధికారులు భావిస్తున్నారు.

చిరుత కదలికలు బోన్లలో చిక్కకపోవడం వల్ల స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. “ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతుందోనన్న భయం.. చిన్నపిల్లలతో బయటికి రావాలంటేనే భయం వేస్తోంది” అని పలువురు స్థానికులు చెబుతున్నారు.

అటవీశాఖ అప్రమత్తం..

అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మిలిటరీ ఏరియాకు చుట్టుపక్కల వాచ్‌టవర్స్ ఏర్పాటు చేసి, ఫారెస్ట్ అధికారుల బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చిరుత ఎటు వెళ్లిందనే విషయంపై ఇంకా స్పష్టత రాకపోయినా, సాంకేతిక పద్ధతులతో ట్రేస్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ప్రజలకు హెచ్చరిక

అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.

Leave a Reply