3 నెలల్లో సేఫ్‌ భవనాలకు మారాలి!

అనుమతులు, ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరి
అసురక్షిత, అక్రమ భవనాల్లో హాస్టళ్లకు ఇక చెక్‌
జనవరి 1 నుంచి మూడు కార్పొరేషన్ల పరిధిలో తనిఖీలు
ప్రాణాలకు ముప్పుగా ఉన్న భవనాలపై కఠిన చర్యలు

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : నగరంలోని హాస్టళ్ల నిర్వహణపై హైడ్రా కమిషనర్‌ ఏ.వి. రంగనాథ్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు, ఇతర నివాసితుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ హాస్టల్‌ నిర్వాహకులు అన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హాస్టళ్లు నిర్మాణపరంగా సురక్షితమైన భవనాల్లోనే కొనసాగాలని, అవసరమైన అన్ని అనుమతులు కలిగి ఉండాలని స్పష్టం చేశారు.

హాస్టళ్లలో ఫైర్‌ సేఫ్టీ పరికరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం అనుమతులు లేకుండా లేదా అసురక్షిత భవనాల్లో నిర్వహిస్తున్న హాస్టళ్లను సురక్షితమైన భవనాలకు మూడు నెలల్లోగా తరలించాలని స్పష్టం చేశారు.

జనవరి 1 నుంచి మూడు కార్పొరేషన్ల సమన్వయంతో హైడ్రా అధికారులు హాస్టళ్లపై తనిఖీలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా భవనాల నిర్మాణ భద్రత, అనుమతులు, అగ్నిమాపక భద్రత, అత్యవసర నిష్క్రమణ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ప్రాణాలకు ముప్పు కలిగించే భవనాలపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా స్పష్టం చేసింది.