Hyderabad Municipal Corporations Merger | మూడు కార్పొరేషన్లను రెండుగా కుదించే యోచన?

Hyderabad Municipal Corporations Merger | మూడు కార్పొరేషన్లను రెండుగా కుదించే యోచన?

  • క్యూర్‌ చట్టంపై సర్కారులో తర్జనభర్జన
  • కార్పొరేషన్ల మధ్య ఆదాయ వనరుల సమతుల్యతపై కసరత్తు
  • గ్రేటర్‌ ఎన్నికల రాజకీయ సమీకరణాలపైనా చర్చ
  • చట్టం అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే పునరాలోచన!

Hyderabad Municipal Corporations Merger | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రేటర్‌ హైదరాబాద్‌ పాలనా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి పునర్వ్యవస్థీకరణ దిశగా ఆలోచన చేస్తోందా? మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లుగా విభజించిన హైదరాబాద్‌ నగర పాలనా వ్యవస్థను రెండింటికే పరిమితం చేయాలని భావిస్తోందా? ఇందుకోసం కొత్తగా తీసుకొచ్చిన కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) చట్టంలో మార్పులు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తోందా? ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో సాగుతున్న చర్చలు ఈ ప్రశ్నలకు తావిస్తున్నాయి. అయితే, మూడు కార్పొరేషన్లను రెండుగా కుదించే అంశంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కార్పొరేషన్ల మధ్య ఆదాయ వనరుల అసమతుల్యత, పరిపాలనా సౌలభ్యం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. ఈ అంశాలన్నీ పునర్వ్యవస్థీకరణ చర్చలో ప్రాధాన్యం సంతరించుకున్నట్లు తెలుస్తోంది. మూడు కార్పొరేషన్లను కొనసాగించాలా? లేక రెండింటిగా మార్చాలా? అన్న దానిపై ప్రభుత్వ పెద్దలు వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఈ పరిణామం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

ఆదాయమే అసలు సమస్య!

హైదరాబాద్‌ నగర విస్తరణకు అనుగుణంగా పాలనను వికేంద్రీకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ను మూడు కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించింది. ఇందులో జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ), సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) ఉన్నాయి. వీటిని కలిపి కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌)గా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుత విభజన ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరు జోన్లు, 150 డివిజన్లు ఉండగా.. మల్కాజిగిరి కార్పొరేషన్‌లో మూడు జోన్లు, 74 డివిజన్లు, సైబరాబాద్‌ కార్పొరేషన్‌లో మూడు జోన్లు, 76 డివిజన్లు ఉన్నాయి. మొత్తంగా మూడు కార్పొరేషన్ల పరిధిలో 300 డివిజన్లు ఉన్నాయి.

అయితే, ఈ మూడు సంస్థల మధ్య ఆదాయ వనరుల పంపిణీ, అభివృద్ధి అవసరాలు ఒకే స్థాయిలో లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య, ఐటీ, రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు విస్తరించిన శివారు ప్రాంతాలతో పోలిస్తే.. పాత నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదాయ వనరుల సమీకరణ సవాలుగా మారే అవకాశముందని చర్చ జరుగుతోంది. దీంతో కార్పొరేషన్లకు అందుబాటులో ఉండే ఆదాయాన్ని సమతుల్యం చేయడం, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులను సమకూర్చడం ప్రభుత్వానికి కీలకంగా మారినట్లు తెలుస్తోంది.

మూడు కార్పొరేషన్లను కొనసాగిస్తూనే ఆదాయ వనరులను ఎలా సమన్వయం చేయాలన్నది ఒక ప్రశ్న కాగా.. కొన్ని ప్రాంతాలను పునర్విభజించి రెండు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చ సాగుతున్నట్లు సమాచారం. ఆదాయ వనరులు అధికంగా ఉన్న ప్రాంతాలను ఇతర ప్రాంతాలతో అనుసంధానించడం ద్వారా ఆర్థిక అసమతుల్యతను తగ్గించవచ్చన్న ఆలోచన కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల లెక్కలూ ఉన్నాయా?

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రాజకీయ సమీకరణాలు కూడా ఈ చర్చకు మరో కోణాన్ని జోడిస్తున్నాయి. నగరంలో ప్రధాన పార్టీల మధ్య పోటీ, గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, మారుతున్న రాజకీయ పరిస్థితులు.. ఇవన్నీ రాబోయే మున్సిపల్‌ ఎన్నికలపై ప్రభావం చూపే అంశాలుగా మారాయి.

పాత జీహెచ్‌ఎంసీ పాలక మండలి గడువు 2026 ఫిబ్రవరిలో ముగిసింది. అనంతరం నగర పాలనా వ్యవస్థలో పునర్వ్యవస్థీకరణ జరగడంతో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మూడు వేర్వేరు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న అంశంపై పార్టీల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, బీజేపీ గణనీయమైన స్థానాలను సాధించగా.. కాంగ్రెస్‌ పరిమిత స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వార్డుల పునర్వ్యవస్థీకరణ, కొత్త కార్పొరేషన్ల పరిధులు ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

మూడు కార్పొరేషన్లకు బదులుగా రెండింటిని ఏర్పాటు చేసే ప్రతిపాదనపై చర్చ జరుగుతుండటంతో.. పరిపాలనా అవసరాలే ప్రధాన కారణమా? లేక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలకూ ప్రాధాన్యం ఉందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే, కార్పొరేషన్ల సంఖ్యను తగ్గించాలన్న ఆలోచన వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయనే అంశానికి సంబంధించి అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

పది రోజులకే పునరాలోచనా?

దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన జీహెచ్‌ఎంసీ వ్యవస్థలో గత కొన్నేళ్లుగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. నగర శివారు ప్రాంతాల్లోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీన ప్రక్రియ అనంతరం జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరించారు. 2025 డిసెంబర్‌ 24న వెలువడిన ఉత్తర్వులతో విస్తరించిన నగర పాలనా వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 11న జారీ చేసిన జీవో 55 ద్వారా జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించారు. అనంతరం క్యూర్‌ చట్టానికి శాసనసభ ఆమోదం లభించగా, గవర్నర్‌ ఆమోదం తర్వాత అక్టోబర్‌ 2 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది.

కొత్త చట్టం అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే కార్పొరేషన్ల సంఖ్యను తగ్గించే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, చట్ట సవరణకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుందా? లేదా కేవలం ప్రాథమిక స్థాయి చర్చలకే పరిమితమైందా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

మూడు కార్పొరేషన్ల ఏర్పాటుతో వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటిని రెండింటికి పరిమితం చేసే దిశగా అడుగులు వేస్తుందన్న ప్రచారంపై అధికారిక వివరణ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. తుది నిర్ణయం ఏదైనా, అది హైదరాబాద్‌ నగర పాలన, ఆదాయ వనరుల పంపిణీ, అభివృద్ధి ప్రణాళికలు, రాబోయే ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపే అవకాశం ఉంది.