Hyderabad-Metro-Takeover-lt-Government-Management-Revenue-Strategy | ప్రభుత్వ రంగంలోనే ‘మెట్రో’ను లాభాల బాట పట్టించే మార్గాల అన్వేషణ!

  • మెట్రో రైలు నిర్వహణకు రేవంత్‌ సర్కారు సరికొత్త కార్యాచరణ
  • ముఖ్యమంత్రి ఆదేశాలతో కసరత్తు మొదలుపెట్టిన అధికారులు
  • ఢిల్లీ మెట్రో నిర్వహణపై అధ్యయనం.. డిసెంబర్‌ నెలాఖరుకు కార్యాచరణ
  • ప్రస్తుతానికి స్తంభించిన వాటాల బదిలీపై హెచ్‌ఎంఆర్‌ఎల్‌ దృష్టి
  • వచ్చే ఏడాది నుంచి అమల్లోకి ఆదర్శవంతమైన నూతన విధానం

Hyderabad-Metro-Takeover-lt-Government-Management-Revenue-Strategy | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో : శరవేగంగా విస్తరిస్తున్న రాజధాని నగర ప్రజా రవాణా వ్యవస్థను సుస్థిరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక కార్యాచరణకు ఆర్థికపరమైన అంశాలు సవాలుగా మారాయి. ఒకవైపు టేకోవర్‌ ప్రక్రియలో నెలకొన్న చిక్కులు.. మరోవైపు మోయలేని స్థాయికి చేరుతున్న నిర్వహణ వ్యయం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం అంతర్గతంగా చర్యలు ముమ్మరం చేసింది. హైదరాబాద్‌ నగర ప్రతిష్టను పెంచిన మెట్రో రైలు ప్రాజెక్టును ఆర్థికంగా బలోపేతం చేసి, లాభాల బాట పట్టించే దిశగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది.

ఇందుకు సంబంధించి ప్రభుత్వ సలహాదారు ఎన్వీఎస్‌ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం కసరత్తు ప్రారంభించింది. నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వం చేతికి వచ్చినప్పటికీ ఆర్థిక లావాదేవీలు పూర్తికాకపోవడంతో టేకోవర్‌ ప్రక్రియలో జాప్యం ఏర్పడింది. అవసరమైన నిధుల సమీకరణ, నిర్వహణ వ్యవస్థ రూపకల్పనపై ఉన్నతాధికారుల కమిటీ సమాలోచనలు, సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ మెట్రో రైలు, బెంగళూరులో అమల్లో ఉన్న ప్రభుత్వ రంగ నిర్వహణ విధానాలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరు నాటికి కార్యాచరణను పూర్తిచేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సీఎం కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

జనవరి నుంచి సర్కారు చేతుల్లోకి..

గడిచిన ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలను పీపీపీ విధానంలో చేపట్టిన ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి వాటాల బదిలీపై హెచ్‌ఎంఆర్‌ఎల్‌ దృష్టి సారించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) ఆధ్వర్యంలోనే మెట్రో రైళ్ల నిర్వహణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మెట్రో రైళ్లను నిర్వహించిన ఎల్‌అండ్‌టీ సంస్థ వైదొలగనున్న నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) తరహాలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఆధ్వర్యంలో రైళ్లను నడిపే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొదటి దశ మెట్రో ప్రభుత్వం చేతికి రానున్న నేపథ్యంలో నిర్వహణ వ్యవస్థను కూడా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించేలా కార్యాచరణ రూపొందుతోంది.

ఢిల్లీలో మెట్రో రైళ్ల నిర్వహణ విధానం, అక్కడ పనిచేస్తున్న యంత్రాంగం, ఆదాయ వనరులు, నిర్వహణ వ్యయం తదితర అంశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. డీఎంఆర్‌సీ తరహా విధానాన్ని హైదరాబాద్‌లో అవసరాలకు అనుగుణంగా అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

రూ.2 వేల కోట్ల చెల్లింపుపై కసరత్తు

ఎల్‌అండ్‌టీ నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలగనున్న నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపైనా అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎల్‌అండ్‌టీ సంస్థకు ఏకమొత్తంగా చెల్లించాల్సిన సుమారు రూ.2 వేల కోట్లతో పాటు నిర్వహణ బాధ్యతల బదిలీ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్నారు.

ప్రభుత్వ అధీనంలోకి రానున్న మెట్రో రైలును తొలిదశలో నష్టాలను తగ్గించి, క్రమంగా ఆదాయాన్ని పెంచేలా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మెట్రో రైలు వ్యవస్థపై అనుభవం ఉన్న ఎన్వీఎస్‌ రెడ్డి నేతృత్వంలో ఈ కసరత్తు కొనసాగుతోంది.

ప్రయాణికులే కీలకం

మెట్రో రైలు వ్యవస్థ లాభాల బాట పట్టాలంటే ప్రయాణికుల సంఖ్యతో పాటు వారు ప్రయాణించే దూరం కూడా పెరగాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ప్రయాణికులు.. ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం కొన్ని మార్గాల్లో పీక్‌ అవర్స్‌లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటోంది.

తక్కువ బోగీలతో రైళ్లు నడుస్తుండటంతో రద్దీ సమయాల్లో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి కారణంగా కొంతమంది మెట్రో ప్రయాణానికి దూరంగా ఉంటున్నారని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఫలితంగా ఆశించిన స్థాయిలో ప్రయాణికుల సంఖ్య పెరగడం లేదని భావిస్తున్నారు.

ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా అదనపు రైళ్లు, బోగీలు అందుబాటులోకి తీసుకురాకపోవడం కూడా ఆదాయంపై ప్రభావం చూపిన అంశాల్లో ఒకటిగా అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.

రూ.13 వేల కోట్ల రుణ భారం

మొదటి దశ ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టీ వైదొలగనున్న నేపథ్యంలో సుమారు రూ.13 వేల కోట్ల బ్యాంకు రుణాలను కూడా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. నిర్మాణానికి తీసుకున్న రుణాలపై వడ్డీ భారం, నిర్వహణ వ్యయం పెరగడం మెట్రో నష్టాలకు ప్రధాన కారణాలుగా అధికారులు పరిశీలిస్తున్నారు.

దేశంలోని ఢిల్లీ సహా పలు నగరాల్లో మెట్రో రైలు వ్యవస్థలను ప్రభుత్వ సంస్థలే నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌ మెట్రో మాత్రం పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో అమలైన ప్రత్యేక ప్రాజెక్టుగా నిలిచింది. ఇప్పుడు ఎల్‌అండ్‌టీ వైదొలగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో మొదటి దశ పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చే అవకాశం ఉంది.

ఢిల్లీ నమూనాపై దృష్టి

దేశ రాజధానిలో ఢిల్లీ మెట్రో అత్యంత వేగవంతమైన, విస్తృత ప్రజా రవాణా వ్యవస్థగా అభివృద్ధి చెందింది. ఢిల్లీతో పాటు గుర్గావ్‌, నోయిడా, ఘాజియాబాద్‌, ఫరీదాబాద్‌, బహదూర్‌గఢ్‌ తదితర ప్రాంతాలకు మెట్రో సేవలు విస్తరించాయి. 2002లో ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభమై.. దశలవారీగా విస్తరణ కొనసాగింది.

ప్రస్తుతం ఢిల్లీ మెట్రో విస్తృత నెట్‌వర్క్‌తో సేవలందిస్తోంది. హైదరాబాద్‌ మెట్రో కూడా ఒక దశలో దేశంలోని అతిపెద్ద మెట్రో వ్యవస్థల్లో రెండో స్థానంలో నిలిచినప్పటికీ.. విస్తరణ మందగించడంతో ప్రస్తుతం ఇతర నగరాలు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో నిర్వహణ విధానాన్ని అధ్యయనం చేసి హైదరాబాద్‌కు అనుగుణంగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌ మెట్రోకు కూడా ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపులు లభించాయి. మొదటి దశ మెట్రో నిర్మాణ సమయంలోనూ ఢిల్లీ మెట్రో నిర్మాణం, నిర్వహణ విధానాలను అధికారులు, నిపుణులు అధ్యయనం చేశారు. ఢిల్లీ విమానాశ్రయం వద్ద భూగర్భ మెట్రో స్టేషన్‌ మాదిరిగానే హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు వద్ద రెండో దశలో భూగర్భ మెట్రో స్టేషన్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు.

రెండో దశకు మార్గం సుగమం?

హైదరాబాద్‌ గ్రేటర్‌ సిటీ పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ, ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఫేజ్‌-2ఏ, ఫేజ్‌-2బీలో భాగంగా ఎనిమిది కొత్త మెట్రో మార్గాలను ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వివరాలు సమర్పించింది. మొత్తం 163 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

మొదటి దశ మెట్రో ప్రభుత్వ ఆధీనంలోకి రానున్న నేపథ్యంలో రెండో దశ ప్రాజెక్టుతో సమన్వయం చేసుకునే అవకాశం మరింత సులభం కానుంది. రెండో దశ ప్రాజెక్టును కూడా ప్రభుత్వమే చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

రెండో దశలో ‘ఏ’ విభాగం కింద 76.4 కిలోమీటర్లు, ‘బీ’ విభాగం కింద మూడు కారిడార్లలో సుమారు 85 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించనున్నారు. ఈ మార్గాలకు సంబంధించి ప్రభుత్వం రెండు దఫాలుగా కేంద్రానికి డీపీఆర్‌లు సమర్పించింది. అయితే ఎల్‌అండ్‌టీతో సమన్వయం, మొదటి దశకు సంబంధించిన అంశాల కారణంగా కేంద్ర అనుమతుల్లో జాప్యం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇప్పుడు మొదటి దశ టేకోవర్‌ ప్రక్రియకు పరిష్కారం లభించే దిశగా అడుగులు పడుతున్నందున రెండో దశకు కూడా త్వరలో కేంద్ర అనుమతులు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

పాతబస్తీ అలైన్‌మెంట్‌పైనా దృష్టి

రోడ్డు విస్తరణ పనులు తుదిదశకు చేరుకున్న పాతబస్తీ మెట్రో అలైన్‌మెంట్‌తో రెండో దశ పనులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కనీసం ఒక కారిడార్‌లోనైనా రెండో దశ మెట్రోను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

నష్టాలకు కారణాలపై లోతైన పరిశీలన

మొదటి దశ మెట్రో నిర్వహణలో ఎదురైన సమస్యలు, పెరిగిన నష్టాలకు కారణాలపై అధికారులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. నిర్మాణ రుణాలపై వడ్డీ భారం, నిర్వహణ వ్యయం, ప్రయాణికుల సంఖ్య, రైళ్ల సంఖ్య, అదనపు బోగీల లభ్యత, వాణిజ్య ఆదాయాలు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.

ఎల్‌అండ్‌టీ సంస్థ నష్టాలను భరిస్తూ మెట్రో నిర్వహణ కొనసాగించడం సాధ్యం కాదని వైదొలగే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం టేకోవర్‌ ప్రక్రియను చేపట్టింది. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోకి రానున్న మెట్రోను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ప్రధాన సవాలుగా మారింది.

ఆదాయ మార్గాలపై అన్వేషణ

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు మెట్రో ఆదాయాన్ని పెంచే మార్గాలపై అధికారులు దృష్టి సారించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వాణిజ్య ప్రకటనలు, స్టేషన్లలో అదనపు వాణిజ్య కార్యకలాపాలు, ఇతర అనుబంధ ఆదాయ మార్గాలపై అధ్యయనం చేస్తున్నారు.

ప్రయాణికుల సంఖ్యను పెంచడంతో పాటు.. మెట్రో వ్యవస్థకు అనుబంధంగా వచ్చే ఆదాయాన్ని గణనీయంగా పెంచగలిగితే నిర్వహణ వ్యయాన్ని తగ్గించి, ఆర్థిక భారాన్ని క్రమంగా అదుపులోకి తీసుకురావచ్చన్నది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది.

ప్రభుత్వ ఆధీనంలోకి వస్తున్న తొలి దశ మెట్రోను ఆర్థికంగా నిలబెట్టడం.. అదే సమయంలో రెండో దశ విస్తరణను వేగవంతం చేయడం.. ఈ రెండు లక్ష్యాలను సమన్వయం చేసుకుంటూ కొత్త నిర్వహణ విధానాన్ని రూపొందించడంపైనే ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించింది.