Hyd | ఈసారి శీతాకాలం డౌటే !!

  • ఎల్‌నినో ఎఫెక్ట్‌.. వింటర్‌లోనూ వేడే
  • శీతాకాలంలోనూ అధిక ఉష్ణోగ్రతలు ..
  • అక్టోబర్‌లోనూ కొనసాగుతున్న వేడి..
  • 35 డిగ్రీలకు చేరిన గరిష్ఠ ఉష్ణోగ్రత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వర్షాకాలం లోటుతో ముగిసిన హైదరాబాద్‌లో ఈసారి శీతాకాలం కూడా చలి తక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం ఈ శీతాకాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్‌నినో పరిస్థితుల ప్రభావం కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా వాతావరణ శాఖ పేర్కొంటోంది.

ఈ ఏడాది జూన్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు కొనసాగిన నైరుతి రుతుపవనాల సీజన్‌లో హైదరాబాద్‌లో 458.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ కాలంలో 627.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 27 శాతం లోటు ఏర్పడింది. తాజాగా విడుదల చేసిన కాలానుగుణ వాతావరణ అంచనాల్లో అక్టోబరులో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.

ఎల్‌నినో ప్రభావం

మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్‌ సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే వేడెక్కే వాతావరణ పరిస్థితినే ఎల్‌నినో అంటారు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వర్షపాత, ఉష్ణోగ్రతల నమూనాలపై పడుతుంది. ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా అక్టోబరు నుంచి హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ చలి ప్రారంభమవుతుంది. అయితే ఈసారి ఆ పరిస్థితి అంతగా కనిపించడం లేదు. బుధవారం నగరంలో అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత సైదాబాద్‌లో 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. బహదూర్‌పురలో 26 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో రానున్న శీతాకాలంలో హైదరాబాద్‌లో చలి తీవ్రత సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.