తేజస్వి యాదవ్‌కు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆతిథ్యం

  • హైదరాబాద్‌కు వచ్చిన ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలకు ఘన స్వాగతం
  • రాష్ట్ర, జాతీయ రాజకీయ పరిణామాలపై నేతల మధ్య చర్చలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :

హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలకు మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఘన స్వాగతం పలికారు. బీహార్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి ప్రసాద్‌ యాదవ్‌, ఎంపీ సంజయ్‌ యాదవ్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు ధరమ్‌పాల్‌ యాదవ్‌, అక్షయ్‌ యాదవ్‌లను తన నివాసానికి ఆహ్వానించారు.

ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని తలసాని నివాసానికి చేరుకున్న నేతలకు ఆయనతో పాటు సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. అతిథులకు స్నాక్స్‌, టీ అందించి ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, తాజా పరిణామాలపై నేతలు చర్చించుకున్నారు.

అనంతరం తలసాని కుటుంబ సభ్యులు ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన యాదవ సంఘాల నాయకులను కూడా ఎమ్మెల్యే తలసాని వారికి పరిచయం చేశారు.

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, నోముల భగత్‌, శ్రీకృష్ణ ట్రస్ట్‌ అధ్యక్షుడు చింతల రవీందర్‌ యాదవ్‌, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్‌, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ కార్పొరేటర్లు శంకర్‌ యాదవ్‌, ఎడ్ల హరిబాబు యాదవ్‌, మహేష్‌ యాదవ్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తలసాని స్కైలాబ్‌ యాదవ్‌, తలసాని ధరమ్‌ యాదవ్‌, కొండాపురం మహేష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.