HYD | ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ మోసం… ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్: ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. బజాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ ప్రతినిధులుగా చెప్పుకుంటూ వాట్సాప్ గ్రూప్ ద్వారా తనను మోసం చేశారంటూ హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చిందని టీజీసీఎస్‌బీ అధికారులు తెలిపారు.

అయితే, ఫిర్యాదుదారుడి నుంచి రూ.3.24 కోట్లు కాజేసిన నిందితులు… దాదాపు రూ.23.25 కోట్లు కాజేసినట్లు పోలీసులు గుర్తించి ముగ్గురిని అరెస్టు చేశారు.

ఈ భారీ మొత్తాన్ని క్రిప్టోకరెన్సీగా మార్చి, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బజాజ్ ఫిన్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పేరుతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. ఈ మోసాలకు ప్రధాన సూత్రధారి ప్రస్తుతం కంబోడియాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

పెట్టుబడి మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అధిక లాభాలను వాగ్దానం చేసే పథకాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు సంస్థల విశ్వసనీయతను ధృవీకరించుకోవాలని సూచించారు. అనవసర మెసేజ్‌లు, కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఒత్తిడిలోనైనా వ్యక్తిగత సమాచారం లేదా డబ్బును బదిలీ చేయవద్దని పోలీసులు కోరుతున్నారు.

Leave a Reply