విస్మయం వ్యక్తం చేసిన కాలనీవాసులు

విస్మయం వ్యక్తం చేసిన కాలనీవాసులు

హైదరాబాద్, జనవరి 4 (ఆంధ్రప్రభ ) : గత మూడు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రంలో శ్రీ సమ్మక్క సారక్క సేవా సమితి సంస్థ ద్వారా మేడారం నుండి హైదరాబాద్ వరకు ఎన్నో సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, ధార్మికసేవలు విశేషంగా అందించిన సంస్థ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పెసరు బాపురెడ్డి ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మరణించారు. ఆయన మరణాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నామని చైతన్యపురి, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, మారుతీనగర్, విద్యుత్ నగర్ కానీల వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంస్కారం, మంచితనం, కలుపుగోలుతనంతో బాపురెడ్డి ఎంతో హుందాగా సాంఘిక సేవలందించారని, మేడారం జాతరంటే బాపురెడ్డి, రమారెడ్డి దంపతులు ఎంతో చక్కగా రూపొందించే ప్రత్యేక సంచికకోసం ఎంతోమంది తెలంగాణా సాహితీవేత్తలు, ఉన్నతాధికారులు ఎదురుచూసే వారని వారు గుర్తు చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు పూజామృతం ధార్మిక ఆధ్యాత్మిక మాసపత్రికను ఎంతో పవిత్ర ఉదాత్త విలువలతో ఎడిటర్ హోదాలో నిర్వహించిన బాపురెడ్డి, తన భార్య రమారెడ్డి పర్యవేక్షణలో గతంలో రహమత్ నగర్, ఫిలింనగర్, బంజారాహిల్స్, కృష్ణానగర్, బోరబండ ప్రాంతాల్లో నిర్వహించిన నేత్ర చికిత్స ఉచిత శిబిరాల గురించి, ఈనాటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారంటే, వారి నిస్వార్థ సేవ, అంకితభావమే కారణమని చెప్పుకోవచ్చు.

భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, నిమ్స్ హాస్పిటల్స్ పూర్వ డైరెక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు, దివంగత దర్శక దిగ్గజం దర్శకరత్న దాసరి నారాయణరావు వంటి ఎందరెందరో మహామహుల చేత బాపురెడ్డి, రమారెడ్డి దంపతుల నిస్వార్థసేవ వేనోళ్ల ప్రశంసలు పొందడం విశేషం. జైనమందిర్ సమీపంలోని బాపురెడ్డి స్వగృహంలో ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలుంచి పలువురు నేతలు, కాలనీ సంక్షేమ సంఘం కార్యవర్గ ప్రముఖులు నివాళులర్పించారు. పెసరు బాపురెడ్డి భార్య, సంఘ సేవికగా నాలుగు దశాబ్దాలుగా విరామెరుగక పరిశ్రమిస్తూ, ఎంతోమందికి మానవీయ సేవలందించిన రమారెడ్డి దుఃఖాన్ని చూసి కాలనీవాసులు కన్నీటి పర్యంత మయ్యారు.

మూడు దశాబ్దాల నాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థ సేవిక సమితి రాష్ట్ర కార్యవర్గంలో కీలక భూమికలో రమారెడ్డి చేసిన సేవల్ని ఈ సందర్భంగా పలువురు మహిళలు గుర్తు తెచ్చుకున్నారు. నాడు భారతీయ జనతాపార్టీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గంలో సైతం రమారెడ్డి కీలక భూమిక పోషించారు. ఆదివారం సాయంత్రం సరూర్ నగర్ స్మశానవాటికలో బాపురెడ్డి బావమరిది ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో బాపురెడ్డి కుమారుడు పెసరు శ్రీకర్ రెడ్డి సంప్రదాయ లాంఛనాలతో దహనసంస్కారం చేయటం పలువురి కంట తడి పెట్టించింది.

Leave a Reply