Breaking News | భారీ పేలుడు.. నలుగురికి గాయాలు!

Breaking News | భారీ పేలుడు.. నలుగురికి గాయాలు!

బ్లాస్టింగ్‌ ధాటికి చెల్లాచెదురైన భవన భాగాలు
ఒకరి పరిస్థితి విషమం.. ముగ్గురిని హైదరాబాద్‌కు తరలింపు
ఒడిశాకు చెందిన ముగ్గురు కార్మికులకు గాయాలు


Breaking News | నల్లగొండ, ఆంధ్రప్రభ: జిల్లాలోని ఓ కంపెనీలో బ్లాస్టింగ్‌ ప్రమాదం కలకలం రేపింది. నార్కట్‌పల్లి మండలం గోపులాయిపల్లిలో ఉన్న ఐడియల్‌ కంపెనీలో జరిగిన పేలుడుతో భవనంలోని పలు భాగాలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

గోపులాయిపల్లిలోని ఐడియల్‌ కంపెనీలో బ్లాస్టింగ్‌ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు తీవ్రతకు భవనంలోని భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనతో కంపెనీ పరిసరాల్లో కలకలం నెలకొంది. ప్రమాదంలో నలుగురు గాయపడటంతో వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు.

గాయపడిన వారిలో ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరో వ్యక్తికి కామినేని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ముగ్గురు ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు. మరొకరు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, బ్లాస్టింగ్‌ సమయంలో తీసుకున్న భద్రతా చర్యలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.