బాణాసంచా గోదాంలో భారీ పేలుడు..

  • ఇద్దరు సజీవదహనం!
  • రెండు కిలోమీటర్ల మేర మార్మోగిన పేలుడు శబ్దాలు..
  • భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం
  • ధాటికి ధ్వంసమైన ఇళ్లు, వాహనాలు..
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
  • గన్‌పౌడర్‌ తయారీ సమయంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా..
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

రాజస్థాన్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా, గన్‌పౌడర్‌ తయారీ గోదాంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ఇద్దరు కార్మికులు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు సమీప ప్రాంతాలు దద్దరిల్లాయి. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో గురువారం (నవంబర్‌ 5) చోటుచేసుకుంది.

ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. భారీ పేలుడు
నాగౌర్‌ జిల్లాలోని బడ్లీ ప్రాంతంలో ఉన్న బాణాసంచా, గన్‌పౌడర్‌ తయారీ గోదాంలో కార్మికులు పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గోదాంలో పొటాషియం నైట్రేట్‌ ఉపయోగించి గన్‌పౌడర్‌ (బారుదు) తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చి భారీ పేలుడుకు దారితీశాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను నాగౌర్‌ పట్టణంలోని బన్‌ బజార్‌ వాడ ప్రాంతానికి చెందిన యువకులుగా గుర్తించారు.

రెండు కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దాలు
పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఏం జరిగిందో తెలియక భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద స్థలానికి సుమారు 100 అడుగుల పరిధిలోని ఇళ్లు, వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గోదాం పరిసర ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

రంగంలోకి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కొత్వాలి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గోదాంలో మరికొందరు చిక్కుకుపోయారా? అనే కోణంలో అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ప్రమాద కారణాలపై ఆరా
గన్‌పౌడర్‌ తయారీకి ఉపయోగించే రసాయనాల కారణంగా ప్రమాద తీవ్రత పెరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే మంటలు చెలరేగడానికి అసలు కారణం ఏమిటి? గోదాంలో భద్రతా ప్రమాణాలు పాటించారా? అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. ఈ ఘటనతో బాణాసంచా, పేలుడు పదార్థాల తయారీ కేంద్రాల్లో భద్రతా చర్యలపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.