‘పంజా’ రీ-రిలీజ్‌కు భారీ డిమాండ్!
- సెప్టెంబర్ 2న 4కేలో రీఎంట్రీ..
- ఇప్పటికే రూ.1.5 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు పంజా మాస్ ట్రీట్ ఇవ్వనుంది. ఐదేళ్లు, పదేళ్లు కాదు.. ఏకంగా పదిహేనేళ్ల క్రితం వచ్చిన ‘పంజా’ ఇప్పుడు 4కేలో మరోసారి బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. 2011లో విడుదలైన ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ను 4కేలోకి తీర్చిదిద్ది సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.
అయితే, రీ-రిలీజ్‌కు ముందే సినిమాపై అభిమానుల్లో భారీ క్రేజ్ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ రూ.1.5 కోట్ల మార్క్‌ను దాటినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్ పుట్టినరోజు నాడు థియేటర్ల దగ్గర సందడి ఏ స్థాయిలో ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది.
విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పంజా’లో పవన్ కల్యాణ్ జై పాత్రలో కనిపించారు. అప్పట్లో తన స్టైలిష్ లుక్, యాక్షన్, మేనరిజంతో అభిమానులను ఆకట్టుకున్న పవన్.. ఇప్పుడు 4కే రీ రిలీజ్ తో మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నారు. అభిమానులతో పాటు కొత్త తరం ప్రేక్షకులను కూడా థియేటర్లకు రప్పించేందుకు రీమాస్టర్ చేసిన ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో ప్రత్యేక ప్రదర్శనలకు కూడా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా తెల్లవారుజామున, ఉదయం ప్రత్యేక షోల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జంట నగరాలతో పాటు పలు ప్రధాన నగరాల్లో అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
‘పంజా’తో పాటు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా టెలివిజన్ ఛానళ్లు కూడా ప్రత్యేక కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నాయి. ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘బంగారం’, ‘వకీల్ సాబ్’ వంటి పవన్ సినిమాలను ప్రత్యేకంగా ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో సెప్టెంబర్ 2న థియేటర్లతో పాటు టీవీ వరకు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందడి కనిపించనుంది.
