HRC | డీజీపీకి టీజీహెచ్‌ఆర్‌సీ నోటీసులు…

హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ) : కుల ఆధారిత దూషణలు, మహిళా పోలీసు సిబ్బంది పట్ల అనుచిత ప్రవర్తనకు సంబంధించిన రెండు ఫిర్యాదులపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ (TGHRC ) కీలకంగా స్పందించింది. ఈ రెండు వ్యవహారాలపై సమగ్ర నివేదికలు సమర్పించాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది. కమిషన్‌ చైర్‌పర్సన్‌ డా. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలో శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు కేసులను తదుపరి నివేదిక కోసం అక్టోబర్‌ 9కి వాయిదా వేశారు.

కుల దూషణలపై ఫిర్యాదు

ఎస్‌ఆర్‌ నంబర్‌ 3678/2026లో జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లి సుధాకర్‌, ఇతరులు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాటా మధుసూదన్‌.. తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను మీడియా సమక్షంలో అసభ్య పదజాలంతో దూషించినట్లు వారు ఆరోపించారు. స్పీకర్‌ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ వ్యాఖ్యలు కుల ఆధారిత అవమానానికి సంబంధించినవిగా ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.

ఇదే ఫిర్యాదులో సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లిలో జరిగిన మరో ఘటనను కూడా ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫామ్‌హౌస్‌ ఎదుట దళితులు నిరసన చేపట్టిన సమయంలో.. బీఆర్‌ఎస్‌ నాయకులు కొందరు పసుపు నీరు, పాలు చల్లి ఆ ప్రాంతాన్ని ‘శుద్ధి’ చేసినట్లు ఆరోపించారు. అంతేకాకుండా దళిత నిరసనకారులను అవమానకర పదజాలంతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళా పోలీసుల సమక్షంలో అర్ధనగ్నంగా నిలబడ్డారని ఆరోపణ

మరోవైపు ఎస్‌ఆర్‌ నంబర్‌ 3680/2026లో ఇందిరా శోభన్‌ చేసిన ఫిర్యాదు కూడా కమిషన్‌ ముందుకు వచ్చింది. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులు తొలగించి.. శాంతిభద్రతల విధుల్లో ఉన్న మహిళా పోలీసు సిబ్బంది సమక్షంలో అర్ధనగ్నంగా నిలబడ్డారని ఆమె ఆరోపించారు.

ఈ ఘటనతో మహిళా పోలీసులకు ఇబ్బంది, మానసిక వేదన, అవమానం కలిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి గౌరవం, భద్రతపై ప్రభావం చూపిన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ, ఇతర వీడియో ఫుటేజీలను పరిశీలించి బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

డీజీపీ నుంచి పూర్తి నివేదిక కోరిన కమిషన్‌

రెండు ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాలతో పాటు రికార్డులో ఉన్న సమాచారాన్ని పరిశీలించిన అనంతరం టీజీహెచ్‌ఆర్‌సీ ఈ నిర్ణయం తీసుకుంది. రెండు కేసులపై తెలంగాణ డీజీపీ నుంచి సమగ్ర నివేదికలు సమర్పించాలని కమిషన్‌ ఆదేశించింది. ఘటనలకు సంబంధించి పోలీసు శాఖ చేపట్టిన చర్యలు, దర్యాప్తు వివరాలను నివేదికలో పొందుపరచాల్సి ఉంటుంది. డీజీపీ నివేదికలు అందిన అనంతరం కేసులపై తదుపరి చర్యలను కమిషన్‌ పరిశీలించనుంది. ఈ రెండు వ్యవహారాల తదుపరి విచారణను అక్టోబర్‌ 9కి వాయిదా వేసింది.