వారెంట్ ఉండగా విదేశాలకు ఎలా వెళ్తారు?

  • ఐఏఎస్ అధికారుల గైర్హాజరుపై హైకోర్టు ఆగ్రహం..
  • క్షమాపణ అఫిడవిట్లతో ముగిసిన ధిక్కరణ కేసు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు విచారణకు హాజరుకాకపోవడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రహదారులు-భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్‌లకు వ్యతిరేకంగా గతంలో బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ వారు కోర్టుకు హాజరుకాకపోవడంపై న్యాయమూర్తి ప్రశ్నలు సంధించారు.

కోర్టు ధిక్కరణ చర్యల్లో భాగంగా ఫారమ్-1 నోటీసులు అందుకున్న తర్వాత కూడా అధికారులు విదేశీ పర్యటనకు ఎలా ప్రణాళిక వేసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. బెయిలబుల్ వారెంట్ ఉన్న సమయంలో విదేశాలకు వెళ్లి తిరిగి వస్తే విమానాశ్రయంలో అరెస్టు చేస్తే ఏం చేసేవారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ప్రభుత్వ అధికారులు కోర్టు ధిక్కరణ కేసులకు సంబంధించిన నిబంధనలను అర్థం చేసుకున్నారా? అని ప్రశ్నించారు.

భూసేకరణ ప్రక్రియలో బాధితులకు 50 శాతం పరిహారం కూడా చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని గతంలో హైకోర్టును ఆశ్రయించారు. బాధితులకు పూర్తి పరిహారం చెల్లించాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది. అయితే ఆదేశాల అనంతరం కూడా పరిహారం చెల్లించలేదంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలోనే అధికారులపై బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి.

అధికారులు అసెంబ్లీ సమావేశాల కారణంగా విచారణకు హాజరు కాలేకపోయారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. అయితే భౌతికంగా హాజరు కావడం సాధ్యం కాకపోతే ఆన్‌లైన్ ద్వారా విచారణకు హాజరయ్యే అవకాశం కూడా ఉందని కోర్టు పేర్కొంది. భవిష్యత్తులో కోర్టు ధిక్కరణ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరే అభ్యర్థనలను సులభంగా అంగీకరించబోమని స్పష్టం చేసింది.

కోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిన సమయంలో బడ్జెట్ లేదని, నిధులు అందుబాటులోకి వచ్చినప్పుడు, ప్రాధాన్యత క్రమంలో పరిహారం చెల్లిస్తామని చెప్పడంపై కూడా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఇలాంటి కారణాలు చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు.

తాజాగా బాధితులకు పరిహారం చెల్లించామని, జరిగిన ఆలస్యానికి క్షమించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అధికారుల తరఫున క్షమాపణ కోరుతూ అఫిడవిట్లు కూడా దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన హైకోర్టు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ముగించింది. అయితే కోర్టు ధిక్కరణ వ్యవహారాలను సీనియర్ అధికారులు తీవ్రంగా పరిగణించాలని, హాజరు విషయంలో కోర్టు ఆదేశాలను పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.