Houthis-Control-Perim-Island : హౌతీల దూకుడు,,!Andhra Prabha Top Story
Houthis-Control-Perim-Island : హౌతీల దూకుడు,,!Andhra Prabha Top Story
- కీలక పెరిమ్ ద్వీపం హస్తగతం
- బాబ్ ఎల్-మందెబ్ స్వాధీనం
- యెమెన్ వెనకడుగు
- హౌతీలపై దాడికి ట్రంప్ నో
- అటు హార్మోజ్….ఇటు బాబ్ ఎల్-మందెబ్ పై ఇరాన్ పరోక్ష పట్టు
(దుబాయ్ , ఆంధ్రప్రభ )
మధ్యప్రాచ్యంలో యుద్ధ మంటలు మరింత విస్తరిస్తున్న వేళ.. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలక సముద్ర మార్గాల్లో బాబ్ ఎల్-మందెబ్ జలసంధిపై హౌతీల పట్టు బిగుస్తోంది. ఇరాన్‌కు అనుకూల యెమెన్ హౌతీ మిలీషియా వ్యూహాత్మక పెరిమ్ ద్వీపంలోకి ప్రవేశించినట్లు యెమెన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానించే ఈ జలసంధి.. అంతర్జాతీయ సముద్ర రవాణాకు కీలక ద్వారం. ఈ ప్రాంతంపై హౌతీలు పూర్తి నియంత్రణ సాధిస్తే.. ఇరాన్‌కు అమెరికాతో జరుగుతున్న పోరులో మరో కీలక అస్త్రం దక్కినట్లే అవుతుంది.
వెనక్కి తగ్గిన ప్రభుత్వ బలగాలు
పెరిమ్ ద్వీపం నుంచి యెమెన్ ప్రభుత్వ బలగాలు వెనక్కి వెళ్లినట్లు రెండు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ద్వీపానికి ఎదురుగా ఉన్న ఎర్ర సముద్ర తీర పట్టణం ధుబాబ్ను కూడా హౌతీలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతంలో హౌతీల దూకుడు పెరిగింది. గురువారం వ్యూహాత్మక పట్టణమైన మోచా, హనిష్ దీవులను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు హౌతీలు ప్రకటించారు.
ఈ పరిణామాలతో బాబ్ ఎల్-మందెబ్ మార్గంలో ప్రయాణించే నౌకలకు ముప్పు మరింత పెరిగింది.
హోర్ముజ్ తర్వాత,,, ఇదే కీలక మార్గం
అరేబియా ద్వీపకల్పానికి అవతలి వైపున ఉన్న హోర్ముజ్ జలసంధి ఇప్పటికే యుద్ధ ప్రభావంతో దాదాపు మూసుకుపోయింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం మీదుగానే సాగేది. హోర్ముజ్ మార్గం దెబ్బతినడంతో సౌదీ అరేబియా తన చమురు ఎగుమతులను ఎర్ర సముద్రం వైపు మళ్లించేందుకు బాబ్ ఎల్-మందెబ్ మార్గంపై మరింత ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో హౌతీల తాజా ముందడుగు రియాద్‌కు కొత్త తలనొప్పిగా మారింది.
సౌదీ పైప్‌లైన్ వద్ద పొగ
ఇదే సమయంలో సౌదీ అరేబియాకు మరో ఆందోళనకర పరిణామం ఎదురైంది. దేశంలోని తూర్పు ప్రాంతాల నుంచి పశ్చిమ తీరానికి చమురును తరలించే ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్ సమీపంలో గురువారం పొగ కనిపించినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి అక్కడ ఏం జరిగిందనే దానిపై సౌదీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. సౌదీ ప్రభుత్వ మీడియా కార్యాలయం, ప్రభుత్వ చమురు సంస్థ అరామ్కో కూడా దీనిపై వెంటనే స్పందించలేదు.హోర్ముజ్ జలసంధి పరిస్థితులు ప్రతికూలంగా మారిన తర్వాత.. సౌదీ చమురు ఎగుమతులను ఎర్ర సముద్రం మీదుగా తరలించేందుకు ఈ పైప్‌లైన్ కీలకంగా మారింది.
39 ఏళ్లల్లొనే సరఫరా కనిష్టం
సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిపైనా తాజా పరిణామాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆగస్టులో దేశ చమురు సరఫరా రోజుకు 23 లక్షల బ్యారెళ్ల మేర తగ్గి 60 లక్షల బ్యారెళ్లకు పడిపోయిందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) తెలిపింది.
ఇది మూడు దశాబ్దాలకు పైగా కాలంలో నమోదైన అత్యల్ప స్థాయి. బాబ్ ఎల్-మందెబ్ మీదుగా వెళ్లే నౌకలపై దాడులు జరగడం కూడా ఈ తగ్గుదలకు ఒక కారణమని ఐఈఏ పేర్కొంది.
మళ్లీ 100 డాలర్లకు చేరువలో చమురు
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఈ వారం ముగిసే సమయానికి బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లకు పైనే ఉండే అవకాశం కనిపిస్తోంది.మే మధ్య తర్వాత తొలిసారిగా ఈ స్థాయికి చేరే పరిస్థితి ఏర్పడింది. హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను తాత్కాలికంగా నిర్వహించేందుకు మధ్యప్రాచ్య దేశాల విదేశాంగ మంత్రులు ఒక ఒప్పందంపై చర్చిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం వెలువడటంతో శుక్రవారం చమురు ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. హోర్ముజ్‌లో నౌకల రాకపోకలు కూడా తగ్గుతున్నాయి. గురువారం కేవలం ఏడు నౌకలు మాత్రమే ఈ జలసంధిని దాటినట్లు ప్రాథమిక నౌకల ట్రాకింగ్ సమాచారం వెల్లడించింది. అంతకుముందు రోజు ఈ సంఖ్య 11గా ఉంది.
ఎదురుదాడికి యెమెన్ సిద్ధం
హౌతీల వరుస విజయాలతో యెమెన్ ప్రభుత్వ బలగాలు ప్రతిదాడికి సిద్ధమవుతున్నాయి. వ్యూహాత్మక ప్రాంతాల్లో హౌతీల కదలికలను అడ్డుకునేందుకు ఆయుధాలు, యుద్ధ విమానాలను రంగంలోకి దించనున్నట్లు ప్రభుత్వ బలగాలు ప్రకటించాయి. మోచా వైపు వెళ్లే రహదారిలో ప్రజలు ప్రయాణించవద్దని సైనిక ప్రతినిధి కల్నల్ మాజెద్ అల్-నజీలీ హెచ్చరించారు. హౌతీలకు చెందిన వాహనాలు, సైనిక సామగ్రికి దూరంగా ఉండాలని సూచించారు. సౌదీ నేతృత్వంలోని బలగాలు గతంలో యెమెన్‌లో హౌతీలపై భారీ వైమానిక దాడులు చేసినప్పటికీ.. ఆ దాడులను తట్టుకుని హౌతీలు తమ ప్రభావాన్ని కొనసాగిస్తూ వచ్చారు.
ఇరాన్ వ్యూహమా?
యెమెన్ తీరంలో హౌతీల తాజా దూకుడు వెనుక ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రత్యక్ష మార్గనిర్దేశం ఉందని యెమెన్ ప్రభుత్వ, ఇరాన్, ప్రాంతీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ గతంలో వెల్లడించింది. అమెరికాతో ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలో కొత్త ఫ్రంట్‌ను తెరవాలన్న వ్యూహంలో భాగంగానే హౌతీలను ముందుకు నడిపిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
సౌదీ అరేబియాపై దాడులను తీవ్రతరం చేయాలని ఇరాన్ గత వారం హౌతీలకు సూచించినట్లు ఇద్దరు ఇరాన్ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం మరింత నిధులు, ఆయుధాలు, సీనియర్ సైనిక అధికారుల సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాయి. హౌతీలకు తాము సైనిక ఆదేశాలు ఇవ్వడం లేదని ఇరాన్ స్పష్టం చేస్తోంది. హౌతీలు తమ మిత్రులే తప్ప.. తమ ‘ప్రాక్సీ’ కాదని ఇరాన్ వాదిస్తోంది.
హౌతీలపై దాడులకు ట్రంప్ నో
ఇక హౌతీలపై ప్రత్యక్ష సైనిక చర్య చేపట్టాలని అమెరికాను సౌదీ అరేబియా కోరినట్లు సమాచారం. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రెండుసార్లు ఫోన్లో మాట్లాడి.. హౌతీ స్థావరాలపై దాడులు చేయాలని కోరినట్లు ‘యాక్సియోస్’ కథనం పేర్కొంది. ట్రంప్ ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు ఇద్దరు అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఆ కథనం తెలిపింది. ప్రస్తుతానికి హౌతీలపై అమెరికా నేరుగా సైనిక చర్య చేపట్టే ఉద్దేశంలో లేదని అధికారులు వెల్లడించినట్లు పేర్కొంది. హౌతీలపై లక్ష్య నిర్ధారణలో అమెరికా సౌదీకి సహకరిస్తోందని ప్రాంతీయ వర్గాలు చెబుతున్నాయి.
హోర్ముజ్‌పై తాత్కాలిక ఒప్పందానికి ప్రయత్నాలు
మరోవైపు హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను తాత్కాలికంగా కొనసాగించేందుకు దౌత్య ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఒమన్, ఇరాన్ చొరవతో గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులు ఇరాన్ విదేశాంగ మంత్రితో సమావేశం కానున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. సోమవారం ఒమన్‌లోని తీర నగరం సలాలాలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని సమాచారం.
