Houthis-Bab-el-Mandeb-Strait : సౌదీకి తల పోటు. Anshra Prabha Top Story
Houthis-Bab-el-Mandeb-Strait : సౌదీకి తల పోటు. Anshra Prabha Top Story
- అమెరికాకు మరో సవాల్
- కన్నీటి ద్వారం,, హౌతీల హస్తగతం
- హౌతీలు ఆధీనంలోకి బాబ్ ఎల్-మందెబ్
- రెండు సముద్ర మార్గాలకు దిగ్బంధం ముప్పు
- హోర్ముజ్ తర్వాత మరో కీలక జలసంధిపై ఇరాన్ పట్టు?
( వాషింగ్టన్, ఆంధ్రప్రభ):
మధ్యప్రాచ్యంలో యుద్ధం ఏడో నెలకు చేరుతున్న వేళ.. మరో ప్రమాద ఘంటిక మోగుతోంది. ఇరాన్ మద్దతుతో దూకుడుగా ముందుకు సాగుతున్న హౌతీలు.. ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి, చమురు రవాణాకు అత్యంత కీలకమైన మరో జలసంధిపై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎర్ర సముద్రానికి ప్రవేశ ద్వారంగా ఉన్న బాబ్ ఎల్-మందెబ్‌పై హౌతీల కదలికలు వేగం పుంజుకోవడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది.
‘కన్నీటి ద్వారం’గా పేరున్న ఈ జలసంధి.. అరేబియా ద్వీపకల్పాన్ని ఆఫ్రికా ఖండం నుంచి వేరు చేస్తుంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన మార్గం ఇది. ఇప్పుడు ఈ ప్రాంతంలో హౌతీల పట్టు పెరిగితే.. ఇప్పటికే యుద్ధ ప్రభావంతో అస్తవ్యస్తమైన ఇంధన మార్కెట్లపై మరో దెబ్బ పడే అవకాశం ఉంది.
ద్వీపానికి చేరిన హౌతీలు
యెమెన్ తీరంలో హౌతీ యోధులు వేగంగా దక్షిణం వైపు కదులుతున్నారు. శుక్రవారం బాబ్ ఎల్-మందెబ్ జలసంధి మధ్యలోని పెరిమ్ ద్వీపానికి వారు చేరుకున్నట్లు సమాచారం.ఈ పరిణామం సౌదీ అరేబియాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హోర్ముజ్ జలసంధి దాదాపు మూసుకుపోవడంతో.. సౌదీ తన చమురులో గణనీయమైన భాగాన్ని ఎర్ర సముద్రంలోని రేవుల ద్వారా తరలిస్తోంది. ఇప్పుడు బాబ్ ఎల్-మందెబ్ మార్గానికీ ముప్పు ఏర్పడితే.. సౌదీ చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అటు హోర్ముజ్.. ఇటు బాబ్ ఎల్-మందెబ్. ఈ రెండు కీలక ద్వారాలపైనా ఇరాన్‌కు అనుకూల శక్తుల ప్రభావం పెరిగితే.. ప్రపంచ ఇంధన రవాణాపై టెహ్రాన్ వ్యూహాత్మకంగా భారీ పట్టు సాధించినట్లవుతుంది.
ట్రంప్‌కు మరో తలనొప్పి
ఇప్పటికే ఇరాన్‌తో యుద్ధం ట్రంప్ ప్రభుత్వానికి భారంగా మారింది. దేశంలో ఇంధన ధరలు పెరగడం, ఆర్థిక ఒత్తిళ్లు.. రాజకీయంగా ఆయనకు ఇబ్బందులు తెస్తున్నాయి. కాంగ్రెస్‌పై నియంత్రణ కొనసాగించాలన్న రిపబ్లికన్ల ప్రయత్నాలపైనా అధిక పెట్రోల్ ధరల ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది. ఇరాన్‌పై సైనిక, ఆర్థిక ఒత్తిళ్లు పెంచి.. ఆ దేశాన్ని చర్చలకు దించే ప్రయత్నంలో ఉన్న ట్రంప్‌కు హౌతీల దూకుడు కొత్త తలనొప్పిగా మారింది. ఇప్పటికే యుద్ధం నుంచి బయటపడే మార్గాన్ని వెతుకుతున్న సమయంలో.. ఎర్ర సముద్రం మార్గాన్ని హౌతీలు మూసివేసే పరిస్థితి వస్తే.. అమెరికా మరో ముందడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ‘‘హౌతీలు ట్రంప్ ప్రణాళికను ఛిద్రం చేశారు’’ అని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ నిపుణుడు వ్యాఖ్యానించారు.
సౌదీ యువరాజు ఫోన్
పరిస్థితి తీవ్రతను గుర్తించిన సౌదీ అరేబియా అమెరికా వైపు చూసింది.సౌదీ వాస్తవ పాలకుడు, యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ గురువారం ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. హౌతీలపై పోరులో అమెరికా సైనిక సాయం కోరినట్లు మూడు వర్గాలను ఉటంకిస్తూ సమాచారం వెలువడింది. ప్రస్తుతానికి ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగేందుకు అమెరికా నిరాకరించింది. అదే సమయంలో సౌదీకి నిఘా సమాచారం, లక్ష్యాలను గుర్తించేందుకు అవసరమైన సమాచార సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ట్రంప్ కూడా యువరాజుతో తాను మాట్లాడిన విషయాన్ని శనివారం ధ్రువీకరించారు. ఆసక్తికరంగా.. హౌతీలు కూడా అమెరికా నేరుగా ఈ యుద్ధంలోకి రావద్దని తమ ప్రభుత్వాన్ని కోరినట్లు ట్రంప్ చెప్పారు.
అమెరికాకు అసలు చిక్కు
హౌతీలు బాబ్ ఎల్-మందెబ్‌ను మూసివేస్తే.. ఇంధన ధరలు పెరగడం మాత్రమే కాదు.. ప్రపంచ వాణిజ్యానికి కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది.అందుకే అమెరికా దీనిని తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి. కానీ హౌతీలతో నేరుగా తలపడటం కూడా అంత సులభం కాదు.గతంలో సౌదీ అరేబియా, అమెరికా దాడులను కూడా హౌతీలు తట్టుకున్నారు. ఇప్పుడు ఇరాన్‌తో యుద్ధంలో ఇప్పటికే అమెరికా సైనిక వ్యవస్థ బాగా ఒత్తిడిలో ఉంది.ఈ సమయంలో యెమెన్‌లో మరో సైనిక రంగాన్ని తెరవడం అంటే.. అమెరికా దళాలకు కొత్త భారం.అందుకే వాషింగ్టన్ ముందు రెండు మార్గాలే కనిపిస్తున్నాయి.హౌతీలను వెనక్కి నెట్టేందుకు అమెరికా దళాలను రంగంలోకి దించాలా?లేక..సౌదీ, దాని మిత్రదేశాలే హౌతీలను ఎదుర్కొనేలా వదిలేయాలా?ఇదే ఇప్పుడు ట్రంప్ ముందున్న అసలు ప్రశ్న.
హోర్ముజ్ తర్వాత.. బాబ్ ఎల్-మందెబ్!
మధ్యప్రాచ్యంలో ఇరాన్ వ్యూహానికి హోర్ముజ్ జలసంధి ఎంత కీలకమో.. ఇప్పుడు బాబ్ ఎల్-మందెబ్ కూడా అంతే కీలకంగా మారుతోంది.ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య దాడులు ప్రారంభమైన తర్వాత హోర్ముజ్ జలసంధిపై అంతరాయం ఏర్పడింది. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగేది. ఇప్పుడు హౌతీలు బాబ్ ఎల్-మందెబ్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటే.. ప్రపంచ చమురు సరఫరాలో మరో 7 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు 12 శాతం ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది చిన్న ముప్పు కాదు.ఒకే ప్రాంతంలో రెండు కీలక ఇంధన మార్గాలు ప్రమాదంలో పడితే.. ఆ ప్రభావం మధ్యప్రాచ్యానికే పరిమితం కాదు.ప్రపంచ మార్కెట్ల వరకు దాని ప్రకంపనలు చేరతాయి.అత్యంత భయంకరమైన పరిస్థితి’ ట్రంప్ తొలి పాలనలో సమీప తూర్పు వ్యవహారాల సహాయ విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన డేవిడ్ షెంకర్ పరిస్థితిని అత్యంత తీవ్రమైనదిగా అభివర్ణించారు. హోర్ముజ్‌తో పాటు బాబ్ ఎల్-మందెబ్‌పైనా ఇరాన్ అనుకూల శక్తుల ప్రభావం ఏర్పడటం ప్రపంచంలోని రెండు ప్రధాన ఇంధన ‘చోక్ పాయింట్ల’పై ఒకేసారి పట్టు సాధించినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు.అది ఇరాన్ చేతిలో అపారమైన వ్యూహాత్మక ఆయుధంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
12 ఏళ్లుగా హౌతీల పట్టు
యెమెన్ రాజధాని సనాను హౌతీలు స్వాధీనం చేసుకుని ఇప్పటికే 12 ఏళ్లు దాటింది. వారిని వెనక్కి నెట్టేందుకు సౌదీ నేతృత్వంలో సైనిక చర్యలు జరిగినా.. ఆశించిన ఫలితం దక్కలేదు. ఇప్పుడు వారే దక్షిణం వైపు దూసుకెళ్లి బాబ్ ఎల్-మందెబ్ ద్వారం వద్దకు చేరుకోవడం పరిస్థితి ఎంతగా మారిందో చెబుతోంది. గత ఏడాది హౌతీలపై అమెరికా బాంబు దాడులను నిలిపివేసేందుకు ట్రంప్ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులను హౌతీలు ఆపితే.. అమెరికా కూడా బాంబుదాడులు నిలిపివేస్తుందన్నది ఆ ఒప్పందం సారాంశం.ఇప్పుడు హౌతీలపై అమెరికా మళ్లీ దాడులు ప్రారంభిస్తే.. ఆ ఒప్పందం ముగిసినట్లే.దీంతో యెమెన్ నుంచి అమెరికా దళాలపై క్షిపణి దాడుల ముప్పు కూడా పెరగవచ్చు.
అమెరికా ఆయుధ నిల్వలపైనా ఒత్తిడి
హౌతీలతో యుద్ధం అంటే కేవలం నౌకలు, విమానాలను రంగంలోకి దించడం కాదు.వారి కదలికలను గుర్తించేందుకు భారీగా నిఘా వ్యవస్థలను ఉపయోగించాల్సి ఉంటుంది. సముద్ర, వైమానిక దళాలను మోహరించాల్సి ఉంటుంది. హౌతీలు ఉపయోగించే డ్రోన్లు, క్షిపణులను అడ్డుకునేందుకు అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు రంగంలోకి రావాల్సి ఉంటుంది.ఇప్పటికే ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్ల నిల్వలపై ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు యెమెన్ రంగం కూడా తెరుచుకుంటే.. ఆ నిల్వలు మరింత వేగంగా తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.అమెరికా మాత్రం తన వద్ద తగినన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయని స్పష్టం చేసింది.‘యెమెన్ మన రోజును పాడుచేయగలదు’అమెరికా మాజీ యెమెన్ ప్రత్యేక ప్రతినిధి టిమ్ లెండర్‌కింగ్ మాత్రం వాషింగ్టన్ మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు.హౌతీలపై సౌదీ చేపట్టే వైమానిక చర్యలకు అమెరికా మరింత నిఘా సమాచారాన్ని అందించాలని.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి దౌత్య, భౌతిక సాయం పెంచాలని అన్నారు.‘‘ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు.. ‘యెమెన్ మనకు ఏం చేయగలదు?’ అని అడిగింది. కానీ ఇప్పుడు సమాధానం వేరుగా ఉంది. యెమెన్ మన రోజును పాడుచేయగలదు’’ అని లెండర్‌కింగ్ వ్యాఖ్యానించారు.
చమురు మార్గాలకు మృత్యుఘంటికా?
మధ్యప్రాచ్య యుద్ధం ఇప్పటికే ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తోంది.హోర్ముజ్ తర్వాత బాబ్ ఎల్-మందెబ్ కూడా ప్రమాదంలో పడితే.. చమురు రవాణా, నౌకాయానం, అంతర్జాతీయ వాణిజ్యం అన్నీ కొత్త ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఒకవైపు ఇరాన్..మరోవైపు హౌతీలు..మధ్యలో కీలక సముద్ర మార్గాలు..వాటి మీదుగా సాగే చమురు నౌకలు, వాణిజ్య నౌకలు..ఇప్పుడు ప్రపంచం చూపంతా ఆ ‘కన్నీటి ద్వారం’ వైపే.హోర్ముజ్ తర్వాత బాబ్ ఎల్-మందెబ్ కూడా మూసుకుపోతే.మధ్యప్రాచ్య యుద్ధం సముద్రాలను దాటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలుపు తట్టడం ఖాయం!
