houthis-attacks-saudi-airport హౌతీల మెరుపు దాడి Andhra Prabha Top News

houthis-attacks-saudi-airport హౌతీల మెరుపు దాడి Andhra Prabha Top News

  • సౌదీలో ముగ్గురు మృతి!
  • 36 మందికి గాయాలు
  • రియాద్‌, అబ్హా విమానాశ్రయాలే లక్ష్యం
  • సౌదీ కూటమి ప్రతీకార దాడులు
  • 80కిపైగా హౌతీ స్థావరాలపై వైమానిక దాడులు
  • బాబ్‌ అల్‌-మందెబ్‌ జలసంధి కోసం హోరాహోరీ పోరు

(రియాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి)

మధ్యప్రాచ్యంలో యుద్ధం మరో మలుపు తిరిగింది. ఇరాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న హౌతీలు.. సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు దిగారు. రియాద్‌, అబ్హా విమానాశ్రయాలపై జరిగిన దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 36 మంది గాయపడ్డారు. సౌదీ పౌర విమానయాన అధికారులు బుధవారం ఈ వివరాలను వెల్లడించారు.
రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మంది గాయపడ్డారు. అబ్హా విమానాశ్రయ పరిధిలోని సౌకర్యాలపై జరిగిన దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది గాయపడ్డారు. ఈ రెండు దాడుల్లో ఒకటి మంగళవారం, మరొకటి బుధవారం జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఏ దాడి ఏ రోజు జరిగిందన్న వివరాలను వెల్లడించలేదు.

80 హౌతీ స్థావరాలపై దాడులు

సౌదీ విమానాశ్రయాలపై దాడులకు ప్రతీకారం తప్పదని సౌదీ నేతృత్వంలోని కూటమి హెచ్చరించింది. చెప్పినట్టుగానే హౌతీలపై భారీ స్థాయిలో వైమానిక దాడులు ప్రారంభించింది. సాదా, హొడెయిడా, జౌఫ్‌, మారిబ్‌ ప్రావిన్సుల్లో హౌతీలకు చెందిన 80కి పైగా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కూటమి ప్రకటించింది. ఇదే సమయంలో సౌదీ రాజధాని రియాద్‌కు ఉత్తరంగా హౌతీలు ప్రయోగించిన బాలిస్టిక్‌ క్షిపణిని తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుని ధ్వంసం చేసిందని కూటమి తెలిపింది. హౌతీ నియంత్రణలోని సనాలో ఉన్న క్షిపణి ప్రయోగ వేదికను కూడా తాము గుర్తించామని.. దానిని ధ్వంసం చేస్తామని హెచ్చరించింది.

అదుపుతప్పుతున్న దాడులు

సౌదీ విమానాశ్రయాలపై దాడులతో పాటు యెమెన్‌లోని ఏడెన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా హౌతీలు దాడి చేశారు.
బాలిస్టిక్‌ క్షిపణులతో పాటు పేలుడు పదార్థాలతో నింపిన డ్రోన్లను ప్రయోగించినట్లు యెమెన్‌ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఓ క్షిపణి రన్‌వే సమీపంలో పడింది. అది పడిన సమయంలో కైరో నుంచి వచ్చిన విమానం ల్యాండ్‌ కావడానికి కేవలం కొన్ని నిమిషాలే సమయం ఉందని అధికారులు వెల్లడించారు. హౌతీల నియంత్రణలో లేని యెమెన్‌ ప్రాంతాలకు ఏడెన్‌ విమానాశ్రయం ప్రధాన అంతర్జాతీయ ద్వారం కావడంతో.. ఈ దాడి మరింత ఆందోళన కలిగించింది. హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరీ మాత్రం రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ విమానాశ్రయంపై పలు డ్రోన్లతో దాడి చేసినట్లు ప్రకటించారు.

అసలు టార్గెట్‌.. బాబ్‌ అల్‌-మందెబ్‌!

యెమెన్‌లో తాజా పోరాటానికి ప్రధాన కేంద్రంగా మారింది బాబ్‌ అల్‌-మందెబ్‌ జలసంధి. ఎర్ర సముద్రాన్ని ఏడెన్‌ గల్ఫ్‌తో అనుసంధానించే ఈ కీలక సముద్ర మార్గం.. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత ముఖ్యమైనది. ముఖ్యంగా ఇంధన రవాణాకు దీని ప్రాధాన్యం మరింత పెరిగింది.
అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా హోర్ముజ్‌ జలసంధి మీదుగా వాణిజ్యానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడిన నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ సముద్ర మార్గాల ప్రాధాన్యం పెరిగింది. దీంతో బాబ్‌ అల్‌-మందెబ్‌పై నియంత్రణ కోసం యెమెన్‌లో జరుగుతున్న పోరాటం ఇప్పుడు అంతర్జాతీయంగా మరింత కీలకంగా మారింది.
ఈ జలసంధిపై హౌతీలకు పట్టు లభిస్తే.. అంతర్జాతీయ నౌకాయానంతో పాటు ప్రపంచ చమురు సరఫరాపైనా ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మోచా చుట్టూ భీకర పోరు

బాబ్‌ అల్‌-మందెబ్‌ సమీపంలోని ప్రాంతాల్లో ఇటీవలి రోజుల్లో పోరాటం తీవ్రరూపం దాల్చింది. సౌదీ మద్దతుతో యెమెన్‌ ప్రభుత్వ బలగాలు.. కూటమి వైమానిక మద్దతుతో హౌతీల ఆధీనంలోకి వెళ్లిన వ్యూహాత్మక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎదురుదాడి ప్రారంభించాయి.
ముఖ్యంగా మోచా పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రభుత్వ బలగాలు దృష్టి పెట్టాయి. సెప్టెంబర్‌లో హౌతీలు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
పశ్చిమ ప్రాంతంలోని ధుబాబ్‌ జిల్లా చుట్టూ కూడా పోరు కొనసాగుతోంది. బాబ్‌ అల్‌-మందెబ్‌ వైపు వ్యూహాత్మక కొండ ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వ అనుకూల బలగాలు ముందుకు సాగుతున్నాయి.

‘మోచా చేరుకున్నాం’.. కానీ!

సోమవారం యెమెన్‌ ప్రభుత్వం తమ బలగాలు మోచా వరకు చేరుకున్నాయని ప్రకటించింది. అయితే ఆ ప్రకటన ముందుగానే చేసినదని అక్కడి సైనిక అధికారులు, విశ్లేషకులు చెబుతున్నారు. మోచా కేవలం ఓ తీర పట్టణం మాత్రమే కాదు. తైజ్‌ ప్రాంతంలోని కీలక యుద్ధ భూములకు వెళ్లే సరఫరా మార్గాల కూడలిలో అది ఉండటం వల్ల సైనికంగా అత్యంత ప్రాధాన్యం కలిగింది. అందుకే మోచాపై ఆధిపత్యం కోసం ఇరువర్గాల మధ్య పోరు మరింత తీవ్రం కావచ్చన్న అంచనాలు ఉన్నాయి.

12 ఏళ్ల నాటి యుద్ధం మళ్లీ..

యెమెన్‌లో తాజా పరిణామాలు కొత్తగా మొదలైన సంక్షోభం కాదు. దాదాపు 12 ఏళ్లుగా కొనసాగుతున్న సంక్లిష్ట యుద్ధానికి ఇది మరో దశ.
2014లో హౌతీలు యెమెన్‌ రాజధాని సనాను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇరాన్‌ ప్రభావం తమ సరిహద్దుల దగ్గర పెరుగుతోందన్న ఆందోళనతో సౌదీ అరేబియా నేతృత్వంలో ఓ సైనిక కూటమి రంగంలోకి దిగింది.
అప్పటి నుంచి యెమెన్‌లో పోరు కొనసాగుతూనే ఉంది.
సౌదీ నేతృత్వంలోని కూటమి.. హౌతీలకు ఇరాన్‌ ఆయుధాలు, శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తోందని ఆరోపిస్తోంది. అయితే హౌతీలు మాత్రం తాము ఇరాన్‌ ఆధ్వర్యంలోని ప్రాక్సీ వ్యవస్థలో భాగం కాదని చెబుతున్నారు. తమ ఆయుధాలను తామే అభివృద్ధి చేసుకుంటున్నామని పేర్కొంటున్నారు.
ఇరాన్‌ కూడా హౌతీలకు ఆయుధాలు అందిస్తున్నారన్న ఆరోపణలను తిరస్కరిస్తోంది.
అమెరికా-ఇరాన్‌ యుద్ధం ప్రభావం
ఇప్పుడు యెమెన్‌లో మళ్లీ యుద్ధం తీవ్రం కావడానికి అమెరికా-ఇరాన్‌ మధ్య విస్తృతమైన ఘర్షణ కూడా ఒక కారణంగా మారింది.
హోర్ముజ్‌ జలసంధిలో వాణిజ్యానికి ఎదురైన ఆంక్షల నేపథ్యంలో.. బాబ్‌ అల్‌-మందెబ్‌ మార్గానికి ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఈ ప్రాంతంలో హౌతీల కదలికలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఒకవైపు సౌదీ అరేబియా.. మరోవైపు హౌతీలు.. మధ్యలో యెమెన్‌ ప్రభుత్వ బలగాలు. వీటికి తోడు ప్రాంతీయ, అంతర్జాతీయ శక్తులు రంగంలోకి వస్తుండటంతో యెమెన్‌ యుద్ధం మరింత సంక్లిష్టంగా మారుతోంది.
సౌదీకి అండగా టర్కీ.. సిరియా కూడా?
హౌతీలను ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియా అంతర్జాతీయ సహకారం కోరుతోంది.
నాటో సభ్యదేశమైన టర్కీ.. ప్రధానంగా రక్షణ, సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఇద్దరు అధికారులు వెల్లడించారు. టర్కీ, పాకిస్థాన్‌లు ఇటీవల ఏర్పరచుకున్న కొత్త కూటమిలో సామూహిక రక్షణ ఒప్పందాన్ని అమలు చేయడానికి అంగీకరించిన నేపథ్యంలో ఈ సహాయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక సౌదీకి మద్దతుగా సిరియా సైనిక సహాయం అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా, సిరియా అధికారులు తెలిపారు.సౌదీ అరేబియాపై హౌతీ దాడులను అడ్డుకునేందుకు రక్షణ దళాలను పంపడం లేదా హౌతీలపై పోరాడుతున్న సౌదీ మద్దతు ఉన్న యెమెన్‌ బలగాలకు సహాయంగా సిరియా సైనికులను మోహరించడం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే సిరియా మాత్రం ప్రస్తుతం తన దృష్టి ప్రధానంగా దేశీయ పునర్నిర్మాణంపైనే ఉందని తెలిపింది.

2 లక్షలు దాటిన నిర్వాసితులు

యెమెన్‌లో తాజా పోరాటం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
తాజా ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి రెండు లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారని అంతర్జాతీయ వలస సంస్థ (IOM) వెల్లడించింది. “ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నారు. కానీ వెళ్లేందుకు సురక్షితమైన ప్రాంతం కూడా దొరకడం లేదు” అని IOM డైరెక్టర్‌ జనరల్‌ అమీ పోప్‌ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆహారం, నివాస సదుపాయాల కోసం అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో మరింత అంతర్జాతీయ నిధులు కావాలని ఆమె కోరారు.
యెమెన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి నాలుగు కుటుంబాల్లో మూడు కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
చమురు.. నౌకాయానం.. ప్రపంచంపై ప్రభావం
హౌతీలు గతంలోనూ సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, చమురు శుద్ధి కేంద్రాలు, పైప్‌లైన్లను లక్ష్యంగా చేసుకున్నారు.
ఇప్పుడు బాబ్‌ అల్‌-మందెబ్‌ చుట్టూ పోరు తీవ్రం కావడంతో సమస్య యెమెన్‌ సరిహద్దులను దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది.
హోర్ముజ్‌ జలసంధి ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న సమయంలో.. బాబ్‌ అల్‌-మందెబ్‌ కూడా అస్థిరంగా మారితే ప్రపంచ ఇంధన సరఫరా, సముద్ర రవాణాపై మరింత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది.
అందుకే సౌదీ విమానాశ్రయాలపై జరిగిన తాజా దాడులను కేవలం మరో దాడిగా చూడటం లేదు. యెమెన్‌లో మళ్లీ రగులుతున్న యుద్ధం.. మధ్యప్రాచ్యంలోని కీలక సముద్ర మార్గాల భద్రతకు మరో పెద్ద సవాలుగా మారుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.