houthis-attack-4-cities-73-injured హౌతీల మెరుపు దాడి Andhra Prabha Top Story
houthis-attack-4-cities-73-injured హౌతీల మెరుపు దాడి Andhra Prabha Top Story
- 4 సౌదీ సిటీలే బీభత్సం
- డ్రోన్లు.. క్షిపణులతో స్వైర విహారం
- 73 మందికి గాయాలు
- చమురు స్థావరాల్లో మంటలు
- ఆరు నెలల యుద్ధంలో కీలక మలుపు
- మళ్లీ భగ్గుమన్న గల్ఫ్..
- బ్యారెల్ చమురు ధర 99 డాలర్లకు పైనే
(ఆంధ్రప్రభ, దుబాయ్)
మధ్యప్రాచ్యంలో ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం మరింత విస్తరిస్తోంది. ఇరాన్ మద్దతున్న యెమెన్ హౌతీలు అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియాపై మంగళవారం భారీ దాడులకు తెగబడ్డారు. దేశంలోని దక్షిణ ప్రాంతంలోని నాలుగు నగరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 73 మంది గాయపడినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. పలు చమురు సంబంధిత స్థావరాల్లో మంటలు చెలరేగాయి. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత సౌదీపై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు.
4 నగరాలే లక్ష్యం
హౌతీల ఆధీనంలో యెమెన్‌లోని జనాభా అధికంగా నివసించే ప్రాంతాలతో పాటు రాజధాని సనాతో సహా విస్తారమైన భూభాగం ఉంది. మంగళవారం సౌదీ భూభాగంలోకి లోతుగా చొచ్చుకెళ్లేలా విస్తృత దాడులు చేపట్టినట్లు హౌతీలు ప్రకటించారు. దక్షిణ సౌదీలోని ఖమీస్ ముషైత్ వైమానిక స్థావరాన్ని డ్రోన్లు, క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నారు. సమీపంలోని అభా, యెమెన్ సరిహద్దులోని నజ్రాన్, ఎర్ర సముద్ర తీరంలోని కీలక నౌకాశ్రయ నగరం జజాన్‌పైనా దాడులు జరిగాయి. జజాన్‌లో భారీ చమురు శుద్ధి కర్మాగారం, విద్యుత్ కేంద్రం ఉన్నాయి.
మహిళలు, చిన్నారులకూ గాయాలు
దాడుల అనంతరం ఆయా ప్రాంతాల్లో మంటలు చెలరేగినట్లు సౌదీ అధికారులు తెలిపారు. గాయపడిన 73 మందిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. అయితే దాడుల అనంతర దృశ్యాలను స్వతంత్రంగా నిర్ధారించేందుకు వెంటనే వీలు కాలేదు. సౌదీలో మీడియాపై ఆంక్షలు ఉండటంతో ప్రత్యక్ష సాక్షులను సంప్రదించడం కూడా సాధ్యపడలేదని సమాచారం.
మళ్లీ గల్ఫ్ పోరు షురూ
ఆగస్టులో దాదాపు నెల రోజుల పాటు కొంత ప్రశాంతంగా ఉన్న గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ పోరు మొదలైంది. అమెరికా, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకోవడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ఆందోళన పెరిగింది. మంగళవారం బ్రెంట్ క్రూడ్ ధరలు 2 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 99 డాలర్లను దాటాయి.
హౌతీల తాజా దాడులు యుద్ధ ప్రభావాన్ని మరింత విస్తరించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ ఆధిపత్యంలో ఉన్నట్లు చెబుతున్న హోర్ముజ్ జలసంధి సమస్యకు తోడు.. ఎర్ర సముద్రం వైపు కూడా ఇంధన సరఫరాలకు ముప్పు ఏర్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
యెమెన్‌లోనూ మళ్లీ మంటలు
హౌతీలపై దశాబ్దానికి పైగా సౌదీ అరేబియా నేతృత్వంలోని అరబ్ కూటమి పోరాడుతోంది. ఇటీవలి సంవత్సరాల్లో అక్కడ ఉద్రిక్తత కొంత తగ్గినప్పటికీ.. తాజాగా కాల్పుల విరమణ విచ్ఛిన్నమైంది. ఎర్ర సముద్ర ప్రవేశ మార్గంలో నౌకల రాకపోకలను అడ్డుకుంటామని హౌతీలు హెచ్చరిస్తున్నారు.
యెమెన్ పశ్చిమ తీరంలో గత మూడు రోజుల్లో జరిగిన పోరుతో 18,500 మందికి పైగా ప్రజలు ఇళ్లను విడిచి వెళ్లినట్లు అంతర్జాతీయ వలస సంస్థ తెలిపింది.
తగిన చర్యలు తీసుకుంటాం
హౌతీల దాడులపై సౌదీ నేతృత్వంలోని కూటమి తీవ్రంగా స్పందించింది. ఈ ఉగ్రవాద మిలీషియాను అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కూటమి అధికార ప్రతినిధి కల్నల్ టుర్కీ అల్ మాల్కీ స్పష్టం చేశారు. అయితే యెమెన్‌పై సౌదీ వైమానిక దాడులను ప్రారంభించిందని హౌతీ ప్రతినిధి యహ్యా సరీ ఆరోపించారు. తమపై దాడులు జరిగితే ప్రతిదాడి తప్పదని హెచ్చరించారు.
సముద్ర దిగ్బంధమే జవాబు
గల్ఫ్‌లో విస్తరిస్తున్న పోరు ఇప్పుడు అమెరికా-ఇరాన్ మధ్య ఆధిపత్య పోరుగా మారింది. ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఇరుదేశాలు వేర్వేరు దిగ్బంధ వ్యూహాలను అనుసరిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ మార్కెట్లకు చమురు సరఫరా కొనసాగేందుకు అమెరికా నౌకలకు మార్గనిర్దేశం చేస్తోంది. అదే సమయంలో ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకునేందుకు జలసంధికి అవతల దిగ్బంధాన్ని కొనసాగిస్తోంది. దీనికి ప్రతిగా హోర్ముజ్‌ను మరింత కట్టడి చేసే చర్యలు చేపడతామని ఇరాన్ ప్రకటించింది. త్వరలో ‘మారిటైమ్ ఎక్స్‌క్లూజన్ జోన్’ వివరాలను వెల్లడిస్తామని తెలిపింది. ఈ ప్రాంతం అమెరికా దిగ్బంధ పరిధి నుంచి హోర్ముజ్ మీదుగా గల్ఫ్‌లోకి విస్తరించనుంది.
అమెరికా యుద్ధ నౌకలపై
వారాంతంలో ఇరాన్ దాడులకు ప్రతిగా అమెరికా.. ఇరాన్ చమురు ట్యాంకర్లపై కాల్పులు జరిపింది. దీనికి ముందు అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ దాడులు చేసినట్లు సమాచారం. తమ దాడుల్లో మరింత శక్తిమంతమైన కొత్త బాలిస్టిక్ క్షిపణులను వినియోగించినట్లు ఇరాన్ వెల్లడించింది. ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ.. అమెరికాకు తమ కొత్త క్షిపణుల సామర్థ్యంపై స్పష్టమైన హెచ్చరిక అందిందని పేర్కొన్నారు. అమెరికా సాగిస్తున్న ఆర్థిక యుద్ధానికి గల్ఫ్ అంతటా సముద్ర దిగ్బంధంతో సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
చమురు సరఫరాపై ఆందోళన
అమెరికా దాడులతో ఇరాన్ సంప్రదాయ సైనిక సామర్థ్యం దెబ్బతిన్నప్పటికీ.. ఆ దేశం వద్ద ఇంకా చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకోగల క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపైనా వాటిని ఉపయోగించే సామర్థ్యం ఇరాన్‌కు ఉందని సమాచారం. యుద్ధానికి ముందు ప్రపంచంలోని మొత్తం చమురు, ద్రవీకృత సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) రవాణాలో దాదాపు ఐదో వంతు హోర్ముజ్ జలసంధి మీదుగా సాగేది. ఇప్పుడు ఈ మార్గంపై ఏర్పడిన ఆంక్షలు ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
అమెరికాలోనూ ధరల సెగ
యుద్ధం కారణంగా ముడి చమురు కొరతతో పాటు.. శుద్ధి చేసిన ఇంధనాల కొరత మరింత తీవ్రంగా మారింది. అమెరికాలో డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరి.. గ్యాలన్‌కు సగటున 5.90 డాలర్లకు పైగా నమోదయ్యాయి. ఈ పరిణామం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ రాజకీయ భవిష్యత్తుపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే యుద్ధంలో విజయం సాధించిన వెంటనే చమురు ధరలు భారీగా పడిపోతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంధన ధరలు గ్యాలన్‌కు మూడు డాలర్లకు.. చివరికి రెండు డాలర్లకంటే దిగువకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని పొందకుండా చేస్తామని కూడా స్పష్టం చేశారు.
